Skip to main content

మహాశివరాత్రి సంకల్పం

 


ఓం నమః శివాయ. 🙏🙏🙏 
 వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ 
దయా శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
 బాల శశాంక మౌళికిఁగ పాలికి మన్మథ గర్వ పర్వతో న్మూలికి 
నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్. - పోతన

శ్రద్ధ ప్రపత్తి శరణాగతి తో ప్రీతిపూర్వకమైన భక్తి తో వేల్పుని మొక్కడం అందరికీ సాధ్యం కాదు. కామ్యపరమైన రాగద్వేషాలతో మొక్కులు పూజలు,యాగాలు యజ్ఞ దాన తపస్సులు చేస్తారు గానీ,  నిర్హేతుకమైన అవ్యాజ సాంద్ర కరుణా ఘన పూరితమైన మనస్సుతో అనన్యభక్తిని హృదయంలో నింపుకోలేరు .
సృష్టి - స్థితి -లయ-  తిరోధాన - అనుగ్రహం అనే పంచకృత్య పరాయణుడైన భగవంతునికి ;
  అండ పిండ బ్రహ్మాండ ములకు , సమస్త స్థావర జంగమాలకు , జనన మరణ మరియు కర్మ చక్ర భ్రమణాలకు మూలకారణమైన తాండవకేళి ,లీలా లాస్య  వినోదునికి;
 నిమిత్త మరియు ఉపాదాన కారణ భూతునికి ; 
  పంచభూత మనో బుద్ధి అహంకారాది  అష్ట ప్రక్రుతి తత్వరూపునికి ;
  తత్పురుష, సద్యోజాత,వామదేవ , అఘోర ఈ శానాది పంచముఖ  చంద్ర శేఖరునికి;
 సత్వ రజస్ తామస త్రిగుణాలను  ,జాగృత్ స్వప్న సుషుప్తి అనే అవస్థలను రూపుమాపే  త్రిశూలధారికి ;
వామాంకిత ఆదిశక్తి గిరిజా మాత ముఖ పద్మ కాంతి దీప్తి కి ,  
సూర్య  చంద్ర వహ్ని యుత  త్రినేత్రునికి  చంద్రమౌళీశ్వరునికి  ;
 వ్యామోహాలను, ప్రాపంచిక ఆసక్తిని అదుపులోఉంచే స్వామికి ;
 నారదాది ముని పుంగవుల మానసిక సరస్సులో అనుక్షణం కదలాడే శుభమంగళా కారునికి మొక్కెదన్ !

Comments