శ్రీ రామునికి కేవలం గుడి కడితే ధర్మం ప్రతిష్టింప బడినట్లేనా? మనలో ధర్మజీవనం, పరోపకార బుద్ధి లేనప్పుడు , పైపెచ్చు అసూయ,అహంకారం, కక్షలు పేట్రేగుతున్నప్పుడు,కేవలం గుళ్ళు కట్టేసి తృప్తి చెందడం రామ (ఆత్మ) వంచన కాదా?
భారతీయ వివాహ వ్యవస్థకు పునాది సీతా రాముల దాంపత్యం. నేటి వివాహ వ్యవస్థ ఎంతగా భ్రష్ట్టు పట్టిపోయిందో వివరించ నక్కర లేదు. అంతేకాదు,అన్నదమ్ముల అనుబంధానికి, మాతా పితరులపట్ల ఆప్యాయత,గౌరవానికి , సమాజం పట్ల కరుణ ,దానం ,పరోపకారం, ప్రక్రుతి పట్ల అవగాహన,బాధ్యత తోకూడిన యజ్ఞం , ధర్మరక్షణ పట్ల అకుంఠిత దీక్ష ,...ఇవన్నీ కనుమరుగై పోయాయి. కనీసం ఆ రాముని భజించుకొందామని ,నిరంతరం ఆ రామచంద్రుని ప్రవర్తన నుండి స్ఫూర్తి పొందాలని ఒకటి కాదు లక్షల గుళ్ళు కట్టుకొన్నాం. కానీ మనిషిలో రాక్షసత్వం కట్టితెగిన గోదారే అయింది. !
రాముని కైనా,అల్లాకైనా,ఏసు కైనా ఎన్ని మందిరాలు కట్టినా ,మనిషిలో ఇసుమంతైనా ధర్మం పట్ల ఇష్టం ఏర్పడకపోతే ఆయా మందిరాల వెనుక ఉన్న పరమార్ధం,వ్యర్ధమే గదా?
జనుల మనోభావాలను బట్టి నాయకులు , నాయకుల వింతపోకడలకు ఆకర్షింపబడి ప్రజలు,ఇలా ఒకరిని చూసి మరొకరు ప్రభావితమై సమాజాన్ని కకా వికలం చేసుకొంటున్నాం.
కానీ, ఒక్క విషయం . అయోధ్య మందిర నిర్మాణం ద్వారా హిందువుల నందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం లో సఫలమైనట్లే కనబడుతుంది. కనీసం కుల భేదాలకు అతీతంగా ఒక్క మతానికి కట్టుబడి , ఈ రాం లల్లా మందిరం నుండి స్ఫూర్తి పొంది హిందువులందరూ ఐక మత్యంగా ఉన్నా, అది దేశ భద్రత కు మేలి మలుపు అవుతుంది.
ముందు దేశం ముఖ్యం. ధర్మం ముఖ్యం.
నమ్మకాలు ,ఆచారాలు,మతం,కులం ఇంటి గడప వరకే!
ఎప్పుడైతే కనీసం 50 శాతం ప్రజలు ధర్మ వర్తనులై ఉంటారో, ఎప్పుడైతే ప్రభుత్వ పాలన రామరాజ్యాన్ని తలపిస్తుందో అప్పుడే నిజమైన రామ ప్రతిష్ట!
ధర్మం అంటే ఏమిటి?
గతుకుల రోడ్ పైన, కొండల్లో సాగుతున్నప్పుడు మనకి కర్ర ఎలాగైతే సాయపడుతుందో,నిత్యజీవితం లో ధర్మం కూడా అలాగే సాయపడుతుంది. ధర్మాన్ని వదిలేస్తే మిగిలేది శోకము,అశాంతి,అనారోగ్యం ,ఆవేదన,పాప కూపం !
ఒక యంత్రం లో రక రకాల సైజుల్లో ఎలాగైతే చక్రాలు లయబద్ధంగా తిరుగుతాయో,ఈ సృష్టి కూడా అనేకరకాల చక్రాల తో లయబద్ధంగా నడుస్తుంది .
కాల ధర్మం , విశ్వ ధర్మం అనేవి పెద్ద చక్రాలు. మనిషి పరిణామం చెందే భూ ప్రపంచం ఓ చిన్న చక్రం. ఎన్నో జాతులుమరెన్నో ప్రాంతాలు,సమాజాలు,దేశాలు,చిన్న చిన్న చక్రాల వంటివి. మనిషి కి కుటుంబం.ఉద్యోగం,వ్యక్తిగత పరిణామం అనే మూడు కర్మ చక్రాలుంటాయి.
ధర్మ చక్రానికి అనుగుణ్యంగా కర్మ చక్రాన్ని నడిపించడమే మనిషి కనీస విధి.
ధర్మంగా జీవిస్తే అడుక్కు తినాలసిందే అనే నేడు చాలామంది భావించడం చేత అన్యాయం,అవినీతి,పెట్రేగి పోతున్నాయి. ధర్మంగా ఉంటే మొదట కష్టంగా ఉన్నా తర్వాత దాని విలువ ఏమిటో తెలిసివస్తుంది. సుఖసంతోషాల కంటే శాంతి,ఆరోగ్యం ,సత్కీర్తి విలువైనవనే కనువిప్పు కలుగుతుంది.
అన్యాయం,అవినీతి,అక్రమాలు మొదట్లో చాలా సుఖాన్ని ఇస్తున్నట్లు కనబడినా అచిర కాలంలోనే అశాంతి,దుఃఖం,అపకీర్తి ఎదురవ్వుతాయి .
ప్రతి వ్యక్తి తానొక్కడే కాదు తన కుటుంబం మొత్తం ధర్మంగా ఉండేటట్లు చూసుకోవాలి. ధర్మ జీవనం ప్రశాంతనిస్తుంది.
ప్రశాంత చిత్తమే శ్రద్ధతో దైవస్మరణ చేయగలదు .
ఇంద్రియాలు , ఇంద్రియాలను ప్రేరేపించే బాహ్య విషయాలు, చిత్త సంస్కారాలు,మనస్సు కోతి లాంటివి. వీటిని అదుపులో ఉంచగల సామర్ధ్యమున్న మానసము,బుద్ధి స్తబ్దుగా ఉంటే మనస్సు,ఇంద్రియాలు పై చేయి సాధిస్తాయి.
అహం పోకుంటే రాగద్వేషాలు పోలేవు!
బాహ్యం లోని భౌతిక విషయాలపై ఉన్న శ్రద్ధను రాముడిపై నిలపాలి. అప్పుడు ఆ శ్రద్ధ ద్విగుణీకృతమై ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక బలం (వీర్యం) ఆధ్యాత్మిక స్ఫురణ ను, స్మృతిని మరింత పెంచుతుంది.
ఎప్పుడైతే విషయ చింతన పోయి ఈశ్వర చింతన పెరుగుతుందో అప్పుడే అధిమానసిక ఎరుక (సమాధి) కలిగి ఈశ్వర సాక్షాత్కారం సిద్ధిస్తుంది.
శ్రద్ధ --- వీర్యం--- స్మ్రుతి -- సమాధి
కాబట్టి సత్ గురుసేవ, సద్గ్రంథ పఠనం ,సత్సంగం ద్వారా బుద్ధిని ధర్మబద్ధం,దైవబద్ధం చేయాలి.
అలా చేయాలంటే శ్రద్ధకు మరో పేరైన హనుమంతుని గురువుగా శ్వీకరించి శ్రీరామ పరబ్రహ్మను పొందాలి.
సహకారం,సమన్వయమే మానవ సంఘ ధర్మం!
మన దేహంలోని కణాలన్నీ నిర్ణీత పద్ధతిలో పరస్పర సహకారం తో కలిసి పనిచేయడం వల్లనే ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ప్రపంచం లోని సమస్త జీవులు,నిర్జీవులు ఒక నియతి లో పనిచేస్తున్నప్పుడే ప్రపంచం శాంతి గా ఉంటుంది. దేహానికి అనారోగ్యం ఎలాగో, ప్రపంచానికి విపత్తులు అలాగే కలుగుతాయి. దేహంలోని కణాల మధ్య పరస్పర సహకారం లోపిస్తే ఎలాగైతే పనితీరు కుంటు పడుతుందో, అలాగే ప్రపంచంలోని జీవుల మధ్యన సహకారం ,సమన్వయం( యజ్ఞము, దానము ) లోపిస్తే యుద్ధాలు,అధర్మాలు ,ఆక్రన్దనలు, విప్లవాలు,తిరుగుబాట్లు, టెర్రరిజం వ్యాపిస్తాయి. సమస్త విశ్వం దేవుని దేహం. మన దేహం లో అసంకల్పిత ప్రతీకార చర్యలు, అటానమస్ చర్యలు ఎలా పనిచేస్తాయో, అలాగే దేవుని దేహమైన ఈ విశ్వం లో కూడా ప్రాకృతిక ,దైవిక చర్యలు పనిచేస్తాయి.
అన్ని దానాల కంటే ఉన్నతమైనది 'ఆధ్యాత్మిక జ్ఞానదానం'. తరువాత 'విద్యాదానం'. తరువాత 'ప్రాణదానం'. నాలుగవది 'అన్నదానం'.
ఇచ్చేవాడు (దాత), స్వీకరించేవాడికంటే (గ్రహీత) అల్పమైనవాడు. ఎందుకంటే స్వీకరించేవాడు ఆ సమయానికి స్వయంగా భగవంతునితో సమానం!" అని స్మృతులు చెబుతాయి. అందుకే మనం చేసే దానం మీదా, దయా, దాక్షిణ్యాల మీదా ఇతరులు ఆధారపడి ఉన్నారన్న అపోహను, అహంకారాన్ని వదిలి, దానం చేసే అవకాశం ఇచ్చినందుకు మనం వారి పట్ల కృతజ్ఞులమై ఉండాలి!
అతిథులను ఆదరించడం మాట అలా ఉంచితే కన్న తల్లితండ్రులను ప్రేమతో చూసుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా మందికి తలకు మించిన భారమవుతోంది. మనం ఎంత దానం చేశామని లెక్కలు పెట్టేకన్నా ఎంత నిస్వార్థభావంతో దానం చేస్తున్నామన్న విషయానికి ప్రాధాన్యమిస్తే గొప్ప వ్యక్తులుగా నిలవగలం.
స్వ ధర్మం ?
నీ శక్తి,యుక్తి ఏమిటో తెలుసుకోవడమే స్వ ధర్మం. నీ బలాలేమిటో,బలహీనతలేమిటో తెలుసుకొని లోటు పాట్లను సరిదిద్దుకోవడమే మనిషి కనీస కర్తవ్యం . తర్వాత నీ సామర్ధ్యానికి తగిన ఆలోచనలు,సంకల్పాలు,కోర్కెలను సాధించుకోవడమే మనిషి రెండవ ధర్మం. దేహాన్ని శుద్ధిగా, మనస్సును పవిత్రంగా ఉంచుకోవడం, త్రికరణాలను( ఆలోచన-మాట-ఆచరణ) ఒకే రీతిలో ఉంచుకోవడం మూడో ధర్మం. ఆచార అనుష్ఠానం , సత్య -అసత్య " మరియు నిత్యా-అనిత్య " మరియు ద్వందాతీత విచారణ నాలుగో ధర్మం.
పిల్లల పెంపకం లో ధర్మాన్ని ఎలా పాటించాలి?
పిల్లలు ఎదిగే వయస్సులో వారిని, ఇంజనీర్ లేదా డాక్టర్ అవ్వాలనో, వృత్తిపరంగా మరేదో సాధించమనో, మనమెందుకు పిల్లల జీవితాన్ని సంకుచితం చేస్తున్నాం? అంటే మనకి కూడా అపరిమిత, విశాల జీవితమంటే ఏమిటో సరియైన అవగాహన లేనందువల్లనే కదా?
జన్మించేటప్పుడు ప్రతిశిశువూ అనంతమైన స్థితిలోనే పుడతాడు. అతడు ఎంతైనా ఎదగగలడు. మనం దేవుళ్ళు గా కొలుస్తున్న రాముడు, కృష్ణుడు కూడా ఇలానే తల్లి గర్భాన పుట్టారు. దేవుణ్ణి మీరు నమ్మితే ఈ పిల్లవాడు కూడా ఆ ''పొటెన్షియాలిటీ' తోనే పుట్టాడు. మనం పిల్లల జీవితాలను సంకుచితపరచకుండా, పరిమితం చేయకుండా స్వేచ్ఛగా అంటే విచ్చలవిడిగా కాదు, సంతోషంగా, కోమలమైన స్పృహతో ఎదగనిస్తే వీరు కూడా ఆ పురాణపురుషులంతటి వారవుతారేమో? ఇదే మనిషి ఆచరించవలసిన కుటుంబ ధర్మం!
ధన ధర్మం.
మనిషికి డబ్బు చాలా ముఖ్యమైన అవసరం. ఈ కాలంలో. డబ్బు లేకపోతే ఎన్నో అవసరాలు దూరంగానే ఆగిపోతాయి. అందుకే మనుషులు డబ్బు సంపాదన పట్ల ఆసక్తిగా ఉంటారు. డబ్బు కొన్ని సార్లు ఆనందాన్ని ఇవ్వలేకపోయినా, భద్రతను ఇస్తుంది. అయితే కొందరు మంచి మార్గంలోనూ, మరికొందరు చెడు మార్గంలోనూ సంపాదిస్తారు. చాలా కొద్ది మంది, అవసరమైనంత మాత్రమే సంపాదించుకుంటు ఉంటారు. కానీ ఎక్కువ మంది అవసరానికి మించి డబ్బు సంపాదనే పరమావధిగా భావించి అదే మార్గంలో వెళుతుంటారు.అవసరాలకు,విలాసాలకు తేడా తెలుసుకొని న్యాయ మార్గంలో సంపాదించడమే జీవన ధర్మం
అర్ధం' అంటే రక్షణ నిచ్చేది. కామం అంటే తృప్తినిచ్చేది. ఎంత ఉన్నా నాకు రక్షణలేదనే మనస్తత్వం ఉన్నవారు డబ్బు,అధికారం కోసం తాపత్రయ పడతారు. ఎంతఉన్నా అసంపూర్ణంగా అసంతృప్తి ఉందని అనుకునేవారు కామం తో రగిలిపోతూ ఉంటారు . తద్వారా అశాంతి ,విచారం నిరంతరం వెన్నాడుతూనే ఉంటాయి. అందుకే ధర్మ చక్ర పరిధిలోనే అర్ధ కామాలను సాధించుకోవాలని పెద్దలు చెప్పారు. ధర్మం ఊత కర్ర లాంటిది. దానిని వదిలేస్తే జారిపోక తప్పదు.
ధర్మ చక్ర పరిధిలో కర్మ చక్రాన్ని నడుపుతూ ఉండటమే ధార్మిక జీవనం . శ్రీరామ చంద్రుడు చేసింది అదే! ధర్మ కర్మ జీవనానికి నిలువెత్తు రూపమే శ్రీరాముడు!
.రామో విగ్రహవాన్ ధర్మ:
బాల్యం నుండే కఠోర శిక్షణ ,బాల్యం దాటీ దాటక ముందే గురు శుశ్రూష, తాటకి వధ తద్వారా లోక క్షేమకరమైన యజ్ఞ యాగపరిరక్షణ ! యవ్వనం పొద్దు పొడవగానే లోకోత్తరమైన శివ ధనస్సును ఎక్కుపెట్టి సీతామాతను గెలుచుకోవడం,పితృ వాక్య నిబద్ధుడై పరిణయమాడటం , రాజస అహంకారం తో తాండవిస్తున్న పరశురాముని సాత్వికుడిగా మార్చి , ఏక కాలం లో ముల్లోకాలకు తన బల సామర్ధ్యాలను ,కళ్యాణ గుణాలను చాటిచెప్పిన లోక వీరుడు శ్రీరామ భద్రుడు.
ముందురోజు యువరాజుగా పట్టాభిషేకం చేస్తామని చెప్పినప్పుడూ , తర్వాతరోజు పట్టాభిషేకం లేదు,యువరాజత్వం లేదు,14 ఏళ్ళు అడవులకు పోయి నార బట్టలు ధరించి సన్యాసిలా నిష్ఠతో కాలం గడపాలని తండ్రి చెప్పినప్పుడు రామునిలో ఎలాంటి మార్పులేదు.
15 ఏళ్ల వయస్సులో వశిష్ఠుడు నేర్పిన యోగ వాసిష్ఠ సారాన్ని నర నరా న,కణ కణాన ఇంకించుకొన్న అంతకరణ శుద్ధి చేత స్థిత ప్రజ్ఞత్వం తో మోము పై నవ్వురాజిల్లుతూ, రాజసాన అయోధ్యను వదిలాడు సీతా లక్ష్మణ సమేత శ్రీరామ చంద్రుడు!
శ్రీరాముని కుటుంబం,ఆయన పరివారం సమస్తం ధర్మ నిష్టా గరిష్టులే!
అఖండ భారతావని అంతటా పాదయాత్ర చేస్తూ ఎక్కడ అసురత్వం అధర్మం ఉందో అక్కడ రామబాణాగ్నిని రగిలించి రక్కసి మూకలను సమిధలుగా, ధర్మయజ్ఞం చేశాడు.
శ్రీరామభద్రు ని జీవితాన్ని అనుకరించు, శ్రీకృష్ణుని బోధను అనుసరించ మని అందుకే పెద్దలంటారు.
అయోధ్య లో రామ్ లల్లా అనగా బాల రాముని ప్రాణ ప్రతిష్ట ( ధర్మ ప్రతిష్ట)
జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు ప్రారంభం కానున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు కొనసాగనుంది. అభిజీత్ ముహూర్తంలో 84 సెకన్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది. వేద మంత్రోచ్చారణ మధ్య రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
సనాతన ధర్మంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణ శక్తి.. ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం అని అర్థం. అప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించగా.. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి ( infusion of divine force) చేరుతుందని హిందూ ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ టైంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగ నుంది .
ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెట్టిన తర్వాతే పూజా కార్యక్రమాలు చేపడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా మాత్రమే చూడకుండా దేవుళ్ల సజీవ రూపంగా భావిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహంలో దేవుడు కొలువై ఉంటాడు. ఇది ఆగమ శాస్త్ర రహస్యం .
ఇప్పటికైనా మనలో ఆ రామజ్యోతి వెలిగి , కనీసం మనిషిలా బతుకుతామనే ఆశతో - శ్రీరామ జయరామ-జయ జయ రామ!
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ము
శుభం భూయాత్
Comments
Post a Comment