భావోద్వేగాలను మానేజ్ చేయడానికి భౌతికపరమైన జ్ఞానం కంటే ఆధ్యాత్మిక / క్వాంటమ్ జ్ఞానం ఎక్కువగా
ఉపయోగపడుతుంది.
ఈ విశ్వములో ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానింపబడి ఉంటాయి. ఇదెలా సాధ్యం? ఎలాగంటే ,అన్నింటిలోఉన్నది
ఒకేఒక ప్రజ్ఞాన తత్వమే (conscious energy)!
అణువును చీల్చి చూసినా, ఓ చెట్టు విత్తనాన్ని చీల్చి చూసినా మన ఇంద్రియాలకు గోచరం కాని పూర్ణతత్వము ఉండబట్టి అణువు నుండి అండ పిండ బ్రహ్మాండాల వరకు భ్రమణ పరిభ్రమణ చేస్తున్నాయి. అనేక రకాల జీవజాలంగా వర్ధిల్లుతున్నాయి. ఆ అఖండ పూర్ణ ప్రజ్ఞాతత్వమే అన్నింటినీ ధరించి భరిస్తుంది అంతేకాదు కార్యము అదే! కారణమూ అదే!
ఓ మర్రి వృక్షం సమస్తం ఓ చిన్ని విత్తనము నుండి ప్రభవిస్తుంది . ఆ చిన్న విత్తనాన్ని కోసి చూస్తే ఎన్నోరకాల ప్రోటీన్,పిండి , కొవ్వు అణువులు తీవ్రమైన వేగంతో కంపిస్తూ ఉంటాయి. ఆయా అణువులను చీల్చి చూస్తే పరమాణువులు,పరమాణువును తరచి చూస్తే మహావేగం తో భ్రమిస్తూ కంపిస్తున్న క్వార్క్ లు ఉంటాయి. వీటన్నింటి ని కంపింప చేసి భ్రమింప చేసే మహాశక్తి నే పురాణ పరిభాషలో అమ్మోరుతల్లి అంటాం, వేద పరిభాషలో పరా శక్తి అని , క్వాంటమ్ శాస్త్ర పరిభాషలో విశ్వ శక్తి అనీ చెప్పుకొంటాం . ఒక నియమిత పద్ధతిలో , ప్రణాళికా బద్ధంగా శక్తిని భిన్న డైమెన్షన్ల లో కంపింప చేయాలనే పథకమే శివమ్. అందుకే శివ శక్తినే చిత్ శక్తి ఇంటెలిజెంట్ ఫోర్స్ ( ALMIGHTY) అంటాం .
మాటలు వేరైనా అర్ధము,పరమార్థమూ ఒక్కటే! పైన చెప్పుకొన్న ఆధ్యాత్మిక సత్యం ,నేటి క్వాంటం శాస్త్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. డార్విన్ పరిణామ సిద్ధాంతం, న్యూటన్ క్లాసికల్ ఫిజిక్స్ కేవలం పైకి కనబడే విషయాలను అర్ధం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ పరమాణు వు కంటే సూక్ష్మ స్థాయిలో క్వాంటం శాస్త్రం ఏదైతే చెబుతుందో, ఈ జీవుల దేహాల వెనుక ఉన్న ఇంటెలి జంట్ ఎనర్జీ గురించి అద్వైత శాస్త్రం అదే చెబుతుంది.
భావోద్వేగాల మూలం మెదడే అని వైద్య శాస్త్రం చెబుతుంటే, ఇంకా లోతుకు వెళ్లి చూస్తే ఆ మెదడుకు కూడా మూలం కాన్షస్ ఎనర్జీ అని అద్వైత శాస్త్రం చెబుతుంది.
క్లాసికల్ ఫిజిక్స్ గ్రహించేది పాక్షిక సత్యమే నని క్వాంటం శాస్త్రం ఎలా నిరూపించిందో , అలాగే,
జీవుల సెన్స్ కి అందేది పాక్షిక సత్యమే తప్ప పూర్ణ సత్యం కాదని అద్వైత శాస్త్రం పదే పదే హెచ్చరిస్తుంది . కాబట్టి మనస్సు , బుద్ధి చేసే పనుల గురించి లోతైన అవగాహన ఉండాలంటే కేవలం భౌతిక వైద్యశాస్త్రాలు సరిపోవు. క్వాంటం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల సమన్వయం అవసరం ఎంతో ఉంది .
అద్వైత శాస్త్రాన్ని అనుసరించి భావోద్వేగాలను ఎలా మానేజ్ చేయాలో ఇపుడు చూ ద్దాం !
మీరు ఎప్పుడైనా గమనించారా? మనిషి లో గానీ, ఏ ఇతర జీవులలోగానీ కలిగే
భావోద్వేగాలను కేవలం రెండు కేటగిరీ లుగా విభజించవచ్చు. ఏమిటవి?
ఇష్టం / అయిష్టం ! వీటినే రాగ ద్వేషాలని కూడా అంటాం.
ఇవి ఎలా ఏర్పడతాయి?
జన్యువుల ద్వారా , అలాగే చిత్తములోని గుణ వాసన ల ద్వారా , పెరిగిన సామాజిక
స్థితిగతుల ద్వారా ఒక మనిషికి ఇష్టము /అయిష్టం అనేవి కలుగుతాయి. ఒకరికి తీపి
ఎక్కువ ఇష్టమైతే మరొకరికి కారం ఎక్కువ ఇష్టం. ఒకరికి నిజం చెప్పడం ఇష్టం,మరొకరికి
అబద్దాలు చెప్పడమే బాగుంటుంది. ఒకరికి డబ్బు అంటే ఇష్టం.మరొకరికి సత్కీర్తి అంటే
ఇష్టం. ఒకరికి దేవుడంటే ఇష్టం. మరొకరికి దయ్యమంటే అదో ధ్రిల్! ఒకరికి రక్తాన్ని ,
బాధను చూడటం ఇష్టం. మరొకరికి పొరుగువారికి సేవచేయడం ఇష్టం.
మనిషి ఈ ప్రపంచంలో ఎదుర్కొనే వాటన్నింటినీ 3 కేటగిరీలలో సర్దేయవచ్చు . మనకు
ఎదురయ్యే మనుషులు, సంపదలు,సంఘటనలు! బస్ !
వీటిని మనం ఎలా డీల్ చేస్తున్నామనే దానిని బట్టి మన ప్రవర్తన,వ్యక్తిత్వం
రూపు దిద్దు కొంటాయి. వ్యక్తిత్వం మనలో కలిగే ఫీలింగ్స్ ను బట్టి ఏర్పడుతుంది.
ఫీలింగ్స్ అనేవి భావోద్వేగాల ను మనం ఎలా డీల్ చేస్తున్నామనే దానిపై బేస్
అయిఉంటుంది . ఇవన్నీ మనం దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది
. ఇంకా లోతుకు వెళితే , మనం దేనిని ఎక్కువ గట్టిగా నమ్ముతున్నామనే దానిని
అనుసరించి దానికి తగిన విలువ ఇస్తాము .
ఉదాహరణకు-
రాముకి డబ్బు తో ఏదైనా సాధించవచ్చని రాము నమ్మకం. కాబట్టి రాము డబ్బుకి ఎక్కువ విలువ ఇస్తాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే
ఆలోచనలతో అతని వ్యక్తిత్వం రూపు దిద్దు కొంటుంది.
సోముకు కీర్తి కి ఎక్కువ విలువ ఇస్తాడు . కాబట్టి ఏ పనిచేసినా అతనికే పేరు
వచ్చేటట్లు కీర్తి కండూతి తో అతని వ్యక్తిత్వం ఉంటుంది.
శాస్త్రి ప్రశాంతతకు ఎక్కువ విలువ ఇస్తాడు కాబట్టి ఏ పనిచేసినా , ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా ప్రశాంతతకు భంగం రాకుండా
చూసుకోవడం లో అతని వ్యక్తిత్వం రూపు దిద్దు కొంటుంది.
రాగ ద్వేషాలు ఒకే నాణానికి ఉన్న రెండు పక్కలు. ద్వేషం అంటే వేరేఏమిటో కాదు,
అది ప్రతికూల అనుబంధమే. మమకార అనుబంధంలో ఎలాగైతే ఆ యొక్క అనుబంధ విషయం పదేపదే ఎలా
జ్ఞప్తికి వస్తుందో, అదే విధంగా ద్వేషంలో ఆ యొక్క ద్వేషింపబడే వస్తు/విషయం పదేపదే
గుర్తుకు వస్తుంది. కాబట్టి, అనురాగము, ద్వేషము రెండూ కూడా మనస్సుపై ఒకే
ప్రభావాన్ని కలుగ చేస్తాయి-అవి దాన్ని మైల పరిచి ప్రకృతిలో ఉన్న త్రిగుణముల వైపు
లాగివేస్తాయి.
రాగద్వేషాలు అత్యంత సహజమైన భావోద్వేగాలు . బాహ్య
కారణాల వలన మాత్రమే కాదు, ఆంతర్యం లోని సహజాతాల( కర్మ వాసనలు) వలన కూడా రాగద్వేషాలు పుడతాయి. వాసనలు పోవాలంటే కేవలం మానవ ప్రయత్నం
సరిపోదు. దివ్య కృప ఉండాలి .
మనస్సు రాగ-ద్వేషములకు అతీతంగా ఉండి, అది భగవత్ భక్తిలోనే నిమగ్నమై
ఉన్నప్పుడు, వ్యక్తికి భగవంతుని కృప లభించి అపరిమితమైన దివ్య ఆనందాన్ని
అనుభవిస్తాడు. ఆయొక్క ఉన్నతమైన రుచిని అనుభవించిన తరువాత, మనస్సుకు ఆయా వస్తువులను
వాడుతున్నా, ఇక ఇంద్రియ భోగ వస్తువులపై అనురక్తి ఉండదు. ఈ ప్రకారంగా, మనందరి
లాగానే రుచి చూస్తున్నా, స్పర్శిస్తున్నా, వాసన చూస్తున్నా, వింటున్నా, మరియు
చూస్తున్నా, స్థిత ప్రజ్ఞుడు రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటాడు.
దివ్య మైన భగవత్ ఆనందాన్ని అనుభవించిన సాధకుడికి ఈ ప్రాపంచికమైన తాత్కాలిక ఆనందాలు రుచించవు.
లౌకిక దృక్పథం లోనే ఉండేవారు భౌతిక వస్తు, విషయముల భోగమే నిజమైన జీవిత
పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే జీవితంలో విజయమనుకుంటారు . ఇంద్రియ సుఖాలు లేకపోవడమే అపజయం అనుకుంటారు.
‘Know God; know peace.’ (భగవంతుడిని తెలుసుకో; శాంతిని పొందు) .
‘No God; no peace.’ (భగవంతుడు లేకపోతే
శాంతి లేదు)
మనస్సుని, ఇంద్రియములను నియంత్రణ చేయటం
నేర్చుకోని వాడు భగవంతుని ధ్యానం చేయలేడు, దివ్య ఆనందాన్ని కూడా పొందలేడు.
ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా, నిమ్న స్థాయి రుచిని త్యజించటం సాధ్యం కాదు,
అలాంటి వ్యక్తి, పుష్పం లోని మకరందాన్ని తేనెటీగ విడిచి పెట్టలేనట్టుగా, ప్రాపంచిక
సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు.
By the grace of God only, the intellect experiences the divine wisdom,divine love and divine bliss!whenever the divine grace showers the seeker of Ananda , the seeker becomes ANANDA!
మానవులు కూడా ఇంద్రియములను తృప్తి పరచటం లోనే
నిమగ్నమై ఉండిపోతారు తప్ప , భగవంతుని భక్తిలో పాల్గొనమని సాధువులు చెప్పిన
సందేశాన్నిపట్టించుకోరు . చిట్టచివరికి, మృత్యువు రూపంలో కాలమే
మనలను కబళిస్తుంది. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి భక్తితో ఉండరో, వారిని మాయ దుఃఖాలతో బాధిస్తూనే ఉంటుంది, అని శ్రీ కృష్ణుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. భౌతిక వాంఛలు ఎక్జిమా దురద వంటివి,
ఎంత తీర్చుకుంటే అంత తీక్ష్ణమవుతాయి. ఇటువంటి ప్రాపంచిక స్థితిలో నిజమైన ఆనందంతో
ఎలా ఉండగలము?
ఎలాగైతే బలమైన వీచేగాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు
నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని
హరించి వేస్తుంది.
బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ధి చేసుకుంటే, ఇంద్రియములు
నిగ్రహింపబడుతాయి; ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో, బుద్ధి దివ్య
జ్ఞాన పథం నుండి ప్రక్కకి తొలగదు( ప్రజ్ఞా ప్రతిష్ఠితా ).
విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 2/ 71 ।।
ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతని భంగం చేసే
వాటిని వివరించి, వాటిని త్యజించమని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు.
భౌతిక/ప్రాపంచిక వాంఛలు: మనము ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే, ఆ తరుణమే, లోభము, క్రోధముల
ఉచ్చులోకి వెళ్తాము. ఎలాగైనా మనము చిక్కుకు పోయినట్టే. కాబట్టి అంతర్గత ప్రశాంతతకి
దారి, కోరికలను తీర్చుకోవటంలో లేదు, వాటిని నిర్మూలించుకోవటంలో ఉంది.
అత్యాశ/దురాశ/లోభము: అసలుకి, భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా
వృధా చేసుకోవటమే. అంతేకాక, అదొక అంతులేని పరుగు. అభివృద్ధిచెందిన దేశాలలో చాలా
కొద్ది మందికి మాత్రమే తిండికి, బట్టలకు లోటు ఉంది, అయినా వారు అశాంతితో ఉంటారు;
ఇది ఎందుకంటే వారిలో తృష్ణ/అత్యాశ ఇంకా తీరలేదు. ఈ విధంగా, సంతృప్తి అనే సంపత్తి
కలిగినవారే గొప్ప ఐశ్వర్యవంతులు.
అహం/అహంకారము: మనుష్యుల మధ్య వచ్చే చాల మటుకు పొట్లాటలు ఈ ‘అహం’ వల్లనే జనిస్తాయి. ‘వాట్
దే డోంట్ టీచ్ యు ఎట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్’ (What They Don’t Teach You At
Harvard Business School) అనే పుస్తకం రాసిన మార్క్ హెచ్ మకోర్మాక్ (Mark H
McCormack) అనే రచయిత ఇలా అన్నాడు : ‘చాలా వరకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ ,
(సంస్థలలో ఉన్నతస్థాయి అధికారులు), రెండు కాళ్ళు రెండు చేతులు పొడుచుకు వచ్చిన
పెద్ద అహంకార బుడగలు.’ గణాంకాలు పరిశీలిస్తే, చాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ
ఉద్యోగం పోగొట్టుకోవటానికి కారణం, వారికి పనిలో నైపుణ్యం లేక కాదు, వ్యక్తుల మధ్య
సమస్యల వలన. అహంకారాన్ని పెంచి పోషించు కోకుండా, దానిని త్యజించటంలోనే ప్రశాంతతకి
మార్గముంది.
స్వామిత్వం/నాది అనే భావన: ‘నాది’ అన్న భావన అజ్ఞానం వలన వస్తుంది, ఎందుకంటే ఈ భూగోళం అంతా
భగవంతునిదే. మనం ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లి పొతాము. మరిక
ఈ ప్రాపంచిక వస్తువులు మనవి అని ఎలా అనుకుంటాము?
EXPECT NOTHING-ACCEPT EVERY THING.
మన ము చేసే వివిధ రకాల కర్మల నుండి వచ్చే ప్రతిఫలము మీద మనస్సు లగ్నమవ్వకుండా, పని చేసే విధానంపైనే లగ్నం చేయాలి. అనగా నైపుణ్యంపైనే మన గురి. జయాపజయాలపై కాదు. ప్రతి పనికీ ప్రతిఫలం దక్కుతుంది. అది కష్టాన్నో,నష్టాన్నో కలిగిస్తుంది. జయాన్నో అపజయాన్నో ఇస్తుంది. పనిపై ఆసక్తి ఉండాలి - పని చేయడం లో నైపుణ్యత ఉండాలి--అది కలిగించే ప్రతిఫలంపై అనాసక్తి అవసరం. ఇది మనం అనుకొంటే రాదు . అభ్యాసం చేయాలి. ఇటువంటి నిర్మోహము/నిర్లిప్తత అనేవి బుద్ధిని ఉపయోగించి వివక్షతతో సాధన చెయాలి. అందుకే, ఆసక్తికరంగా శ్రీ కృష్ణుడు దీనిని 'బుద్ధి యోగము' అన్నాడు.
ఫలితాలపై ఆసక్తి/మమకారం వదిలేస్తే, వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపొదా? అని తరచుగా, సందేహం వ్యక్తం చేస్తారు; స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మనపని లోని నాణ్యత ఏ మాత్రం తగ్గదని;
పైగా, మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
తన చికిత్సా ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధిగల శస్త్రచికిత్సా
వైద్యుడిని ఉదాహరణగా పరిశీలిద్దాం. అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు,
రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతను చలించడు. ఎందుకంటే, అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా,
తన శక్తి మేర, ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి, ఒకవేళ శస్త్రచికిత్స
ప్రక్రియలో రోగి మరణించినా ఆయనకు హత్య చేసిన అపరాధ భావన రాదు. కానీ, అదే వైద్యుడి ఏకైక
బిడ్డకి శస్త్రచికిత్స చేయవలసి వస్తే, అతనికి ఆ పని చేసే ధైర్యం ఉండదు. ఫలితముపై ఉన్న
మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగా చేయలేనేమో అని భయం ఉంటుంది, కాబట్టి వేరొక వైద్యుడిని
ఆశ్రయిస్తాడు. ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు; పైగా మన సామర్థ్యాన్ని
దెబ్బ తీస్తుంది, అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. దీనికి బదులుగా, మమకారము/బంధము
లేకుండా పని చేస్తే, భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత లేదా గాభరా లేకుండా మన గరిష్ఠ
నైపుణ్య సామర్థ్యంతో పని చేయవచ్చు.
ఒక ఉన్నత ప్రయోజనం కోసం, తమను తాము ఉద్ధరించుకోటానికి మానవులకు జ్ఞాన శక్తి ఇవ్వబడింది. ఒకవేళ మనుష్యులు తమ బుద్ధిని జంతువులు,కీటకాల వలె తినటం, నిద్రపోవటం, సంభోగం( జాతిని వ్యాప్తి చేసుకోవడం), మరియు రక్షించుకోవటం వంటి కార్యాలకు మాత్రమే ఉపయోగిస్తే అది మానవ శరీరాన్ని దుర్వినియోగం చేసినట్టే.
అందుకే శ్రీకృష్ణుడు బుద్ధికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చాడు.
మమకారాసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదేపదే మమకార వస్తు/విషయం వైపు పరుగులు తీస్తుంది, అవి వ్యక్తులు, ఇంద్రియ విషయములు, ప్రతిష్ఠ, శారీరిక సుఖాలు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలంపులు పదేపదే మనస్సుకు వస్తుంటే అది, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడిఉంది అన్నదానికి సూచన కావచ్చు. కానీ, అనుబంధం/మమకారాసక్తి ఏర్పరుచుకునేది మనస్సు అయినప్పుడు ఈ యొక్క అనుబంధం/మమకార విషయాలలో శ్రీ కృష్ణుడు బుద్ధిని ఎందుకు తీస్కోస్తున్నాడు? అనుబంధం/మమకారాలను తొలగించటంలో బుద్ధికి ఏమైనా పాత్ర ఉందా?
మన శరీరంలో సూక్ష్మమైన 'అంతఃకరణ' ఉంటుంది, వ్యావహారికంగా దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ధి, మరియు అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ యంత్రంలో ‘బుద్ధి’ అనేది 'మనస్సు' కంటే ఉన్నతమైనది. బుద్ధి నిర్ణయాలు చేస్తే, మనస్సు కోరికలను సృష్టించి, బుద్ధి నిశ్చయించిన ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకి, ఒకవేళ బుద్ధి గనక సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే, మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఒకవేళ, పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యం అని బుద్ధి నిశ్చయిస్తే, అప్పుడు మనస్సు పేరుప్రతిష్ఠల కోసం వాంఛిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధి యందు ఉన్న జ్ఞానం ప్రకారంగా, మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది.
రోజంతా మనస్సుని బుద్ధి ద్వారా నియంత్రిస్తూనే ఉంటాము. ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా కాళ్ళు చాపుకుని మనస్సుకి నచ్చినట్టుగా కూర్చుంటాము. కానీ, కార్యాలయంలో (ఆఫీసు) లో కూర్చున్నప్పుడు అధికారికంగా కూర్చుంటాము. ఆఫీసు క్రమబద్ధత మన మనస్సుకి నచ్చి కాదు, దాని ఇష్టానికి వదిలేస్తే ఇంట్లో ఉండే అనధికార వాతావరణమే కావాలంటుంది. కానీ, ఆఫీసులో అధికారిక ప్రవర్తన అవసరము అని బుద్ధి నిర్ణయిస్తుంది. కాబట్టి, బుద్ధి అనేది మనస్సుని నియంత్రించటం వలన, మనస్సు యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా, కార్యాలయ మర్యాద కోసం, మనము రోజంతా నిబద్ధతతో ఆఫీసులో కూర్చుంటాము. ఇదే విధంగా, దాని ఇష్టానికి వదిలేస్తే, మనస్సు ఆఫీసు పని చేయటానికి ఇష్టపడదు, ఇంట్లో కూర్చుని టెలివిజన్ చూసేందుకే మొగ్గు చూపుతుంది. కానీ, జీవనోపాధి కోసం ఆఫీసులో పని చేయటం అవసరం అని 'బుద్ధి' నిర్ణయిస్తుంది. కాబట్టి, మళ్లీ మనస్సు యొక్క సహజ స్వభావాన్ని, బుద్ది నియంత్రిస్తుంది, మరియు జనులు రోజుకి ఎనిమిది గంటలు లేదా ఆ పైగా పని చేస్తారు.
ఈ పై ఉదాహరణలు, మానవులగా మన బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉంది, అని నిరూపిస్తున్నాయి.
ఎమోషన్స్ పుట్టేది మనసులో. కానీ ఆ ఎమోషన్స్ ను ఎలా ఫీలవ్వాలో ఎలా తీసుకోవాలో నిర్ణయించేది బుద్ధి!
మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని, సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి. బుద్ధి యోగము అంటే, అన్నీ పనులు భగవంతుని ప్రీతి కోసమే అని బుద్ధిలో ధృఢ నిశ్చయం చేసుకోవటం ద్వారా కర్మ ఫలాల పట్ల ఆసక్తిరహితంగా ఉండగలిగే కళ. అలాంటి ధృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, లక్ష్యంపై ఏకాగ్రదృష్టితో, విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా ఈ పథంలో దూసుకెళ్తాడు. సాధనలోని పై స్థాయిలలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుందంటే, ఇక ఏదీ కూడా సాధకుడిని ఆ పథం నుండి తప్పించలేదు. సాధకుడు/సాధకురాలు ఇలా అనుకుంటారు, ‘ఎన్ని కోట్ల అవాంతరాలు నా దారిలో వచ్చినా, ప్రపంచమంతా నన్ను ఖండించినా, నా ప్రాణాలే వదిలివేయాల్సి వచ్చినా, నా సాధనని మాత్రము విడిచిపెట్టను.’ అని.
కానీ, ఎవరి బుద్ధి పలువిధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశలలో పరిగెడుతుంటుంది. అలాంటి వారు ఆనంద పథంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతని పెంపొందించుకోలేరు.
ఏదైనా ఒక విషయాన్నిధృడంగా నమ్మిన బుద్ధి నే శ్రీ కృష్ణుడు వ్యవసాయాత్మికా బుద్ధి, స్థిరబుద్ధి అంటాడు .
ఒక విషయాన్ని నమ్మాలంటే ఆ విషయంపై సంపూర్ణ మైన సమాచారం,అవగాహనా ఉండాలి. అంటే జ్ఞానం ఉండాలి . అంతేకాదు,ఆ జ్ఞానం పై విశ్వాసం ఉండాలి. అప్పుడే శ్రద్ధ బలపడుతుంది.
ఇక్కడ మన లక్ష్యం ఏమిటి?
ఆనందంగా ఉండాలి. వీలయితే ఆ ఆనందం శాశ్వతంగా ఉండాలి. ఆనందాన్ని పదిమందికి పంచగల సత్తావుండాలి.
అంటే మనిషి ఏమి చేయాలి ?
ఆనందం ఎలా దక్కుతుందో సమాచారం కావాలి . ఎలా దక్కించుకోవాలో అవగాహనా ఉండాలి. అవగాహన చేసుకొన్న విషయాన్ని అమలులో
పెట్టే దృఢమైన నిశ్చయాత్మక బుద్ధివుండాలి.
‘స్వర్గాది లోక భోగములను అనుభవించటం కోసం వేదోక్తములైన ఆడంబరమైన కర్మ కాండలు ఆచరించే వారు, తమకు తామే శాస్త్ర పండితులమనుకుంటారు, కానీ నిజానికి వారు వెఱ్రివారు. గుడ్డి వారికి గుడ్డివారు దారి చూపించేవంటి వారు.’అలాగే ఆనందం పట్ల అసంబద్ధ అసంపూర్ణ శుష్కమైన సమాచారం , అసంపూర్ణమైన అవగాహన ఉన్న వారు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు .
అహాన్ని కరిగించి, అంతరంగం లో అంతర్యామిని సదా స్మరిస్తూ బాధ్యతలను నిర్వహించడం, ఎదురయ్యే భిన్న సమస్యలను, భావోద్వేగాలను అవగాహనా పూరిత దృక్పధం తో ఓ ఆట ( challenges in a game ) గా భావిస్తూ పరిష్కరించడం , మానసిక సౌందర్యమే ఆనందానికి హేతువని బలంగా నమ్మి ఆచరణలో పెట్టడం ప్రశాంత జీవనానికి సోపానం.
వైద్య శాస్త్ర పద్ధతిలో లేదా పాశ్చాత్య వ్యక్తిత్వ వికాస రచయితలు చెప్పిన పధ్ధతి లో భావోద్వేగాలను ఎలా మానేజ్ చేయాలో చాలామంది వైద్యులకు తెలిసిన విషయాలే కాబట్టి వాటి గురించి ఇక్కడ చర్చించడం లేదు.
Comments
Post a Comment