Skip to main content

మోడ్రన్ మెడిసిన్ పై దాడి.

మోడ్రన్ మెడిసిన్ పై దాడి! మోడ్రన్ వైద్యులపై దాడి. 

 రోగులు వినియోగాదారులా? 

1. గత 2 దశాబ్దాలుగా మోడ్రన్ మెడిసిన్ పై  చట్టాలు,ఆర్డినెన్స్ ,పన్నుల రూపం లో ప్రభుత్వాలు దాడి చేస్తూనే ఉన్నాయి.  

2.రోగులను వినియోగదారులను చేసేశారు. వైద్యాన్ని అంగట్లో సరకు లెక్క వినిమయవస్తువుగా, వినిమయసేవల స్థాయికి  దిగజార్చేశారు. దీనికి పెట్టిన అందమైన పేరు-వినియోగదారుల రక్షణ.!

రోగులు వినియోగాదారులా? వైద్యులు రోగ సేవలను అమ్ముకొనే  దుకాను వర్తకులా? హాస్పిటల్స్ దుకాణాలా ?

3.క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం పెట్టి ,  ప్రజాబాహుళ్యానికి అందుబాటులో అత్యంత చౌకగా  వైద్యం  అందిస్తున్న చిన్న హాస్పిటల్స్ ను క్వాలిటీ కంట్రోల్ పేరిట నానా విధాలుగా హింసిస్తున్నారు. తద్వారా వైద్యసేవలు ఖరీదై సామాన్యుడి జేబుకి చిల్లులు పడిపోతున్నాయి.

4.ఈ మధ్యనే (2022) ఆంధ్రా IMA నాయకుల చొరవ వలన ,దేశంలోనే మొదటిసారిగా , ఫైర్ NOC  చాలా  చౌకలో చాలా  తేలికగా లభ్యమవ్వడం కొంత అదృష్టం అని చెప్పాలి.  లేకపోతె  FIRE NOC తెచ్చుకోవడం తలప్రాణం తోకకు వచ్చేది. 

 5.ఆరోగ్యశ్రీ,ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో  సామాన్యుడికి వైద్య భీమా రక్షణ అందించడం చాలామంచి విషయం. క్వాలిటీ హాస్పిటల్స్ ను ఎంపానెల్ చేయడం కూడా మంచిదే . కానీ  కోట్లమంది పేదలకు  ఆరోగ్య సేవలు అందించడానికి ఏవోకొన్ని నెట్వర్క్  హాస్పిటల్స్ సరిపోవు గదా.   

6.మన ఆంద్ర రాష్ట్రం లో క్లినిక్స్ గానీ,చిన్న హాస్పిటల్స్ గానీ సుమారు 8000 ఉన్నాయి. కానీ ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న  ప్రవేట్ హాస్పిటల్స్ కేవలం 700 మాత్రమే! 5కోట్ల జనాభా  ఆరోగ్యరక్షణ కు  700 హాస్పిటల్స్ ఏ మాత్రం సరిపోవనే విషయం గమనించాలి. 

  7. ముఖ్యంగా గత 2ఏళ్ల లో నూతన జాతీయవిద్యావిధాన చట్టం, జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ చట్టం, జాతీయ వైద్య కమిషన్ చట్టం ,  ఇప్పుడు ఆయుర్వేద వైద్య రెగ్యులేషన్ సవరణ ఆర్డీ సెన్స్ ... వీటన్నింటి ద్వారా మోడ్రన్ మెడికల్ విద్యను నెమ్మదిగా నెమ్మదిగా  చంపేస్తు న్నారు. 

 8.మోడ్రన్ మెడికల్ విద్యను, ఆయుష్ వైద్య విద్యను కలగాపులగం చేయడం , ఆయుష్ వారితో మోడ్రన్ వైద్యం చేయించడం  లాంటివన్నీ   ఒక పధ్ధతి ప్రకారం మోడ్రన్ వైద్యాన్ని రూపుమాపే కుట్రలే ! 

 9.భారతప్రభుత్వం ఈ మధ్యనే కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం గానీ, జాతీయవైద్య కమిషన్ గానీ ,మోడ్రన్ వైద్యాన్ని భ్రష్ట్టు పట్టించి నెమ్మదిగా కనుమరుగు చేస్తాయ నడం లో ఏమాత్రం సందేహం లేదు. 

10. సాంప్రదాయ వైద్యాన్ని,మోడ్రన్ వైద్యాన్ని మిక్స్ చేయాలనే ఆలోచన  కామన్  సెన్స్  ఉన్న ఎవరికైనా  వస్తుందా? నీతి ఆయోగ్ కి ఈ ఐడియా ఎవరిచ్చారో వారికి నమస్కారం. 

11.కాపౌండర్లు,నర్సులకు 6 నెలల తర్ఫీదిచి వారితో   డాక్టర్స్ లెక్క వైద్యం చేయించాలనే ఆలోచన ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికైనా  వస్తుందా? జాతీయ వైద్య కమిషన్ చట్టం చేసిన మేధావులకు ఈ ఐడియా ఎవరిచ్చారో వారికి రెండు నమస్కారాలు.  

12.దేశాన్ని 21 వ శతాబ్దం  లోకి తీసుకెళ్లుతున్నారా ? లేక మధ్యయుగపు చీకట్లకు దగజార్చు తున్నారా ? 

 13.గూండాలు వైద్యులను,హాస్పిటల్స్ ను ధ్వంసం చేస్తూ  మారణహోమం చేస్తుంటే తట్టుకోలేక  కేంద్ర మెడికల్ రక్షణ చట్టం చేయమని  వైద్యులు  ఎంతగా మొర పెట్టుకున్నా చీమకుట్టినట్లయినా లేదు ప్రభుత్వానికి. 

14.ఇప్పటికీ ఒక కుటుంబ సాలుసరి ఆరోగ్యరక్షణ   ఖర్చు లో 75 శాతం వారి సొంతజేబులో నుండే ఖర్చు చేస్తున్నారు . 

15.గత 70 ఏళ్లుగా మనదేశ జి డి పి లో  కేవలం 1% మాత్రమే ఆరోగ్యరంగానికి బిచ్చమ్ వేస్తున్నారు. పల్లెల్లో వైద్యులు అవసరం లేదా ? మందులు,మంచాలు,లాబ్ లు అక్కర లేదా? అన్ని సేవలను నర్సులు,ఆశా లతోనే చేయిస్తే అసలైన వైద్యం గ్రామీణ భారతీయులకు ఎప్పటికి అందేను ? ఈ లోగా రోగాలు ముదిరి తడిసి మోపెడు ఖర్చు వలన రోగులకు చివరికి చిప్ప చేతి కొస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. 

16.లాస్ట్ మైల్ ఆరోగ్యసేవల ను క్వాలిటీ వైద్యులతో అందించినప్పుడే మార్బిడిటీ , మోర్టాలిటీ ,ఆర్ధిక భారం, పనిదినాల నష్టం తదితర కష్టనష్టాలను ప్రభావశీలంగా తగ్గించగలం. అందుకే సబ్ సెంటర్స్  అనగా వెల్ నెస్ సెంటర్లలో  కూడా తప్పనిసరిగా ఒక  MBBS డాక్టర్ ను నియమించాలని IMA ఎప్పటినుండో   డిమాండ్ చేస్తోంది. 

17.ఎలాంటి అర్హతలేని వాళ్ళు ఎడా పెడా వైద్యం చేస్తున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి తప్ప వారిని అదుపు చేయడం లేదు. నకిలీ వైద్యం చేసే క్రిమినల్స్ ను ఊరికి  వదిలేసి అన్ని అర్హతలున్న మోడ్రన్ డాక్టర్స్ పై సవాలక్ష నిబంధనలు నిభాయించి మోడ్రన్ డాక్టర్స్ ను  సతాయిస్తుంది ప్రభుత్వం. 

  • 18.      కార్పోరేట్ హాస్పిటల్స్ ను, సన్నకారు హాస్పిటల్స్ ను ఒకే గాటన కట్టేయడం వలన , బిగ్ హాస్పిటల్స్ తో సమానంగా  చిన్న హాస్పిటల్స్  ఖరీదైన,కఠినమైన నియమ నిబంధనలు ఎలా అమలు చేయగలవు?
  • 19.    మెడికల్ టూరిజం ద్వారా ఏటా 6 బిలియన్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న హాస్పిటల్స్  లో పనిచేయడానికి నాణ్యమైన వైద్యులు లేకుండా చేసే నూతన మెడికల్ విద్యా విధానానికి తెర తీస్తుంది ప్రభుత్వం. 

  • 20ఈ మధ్యనే ఆంధ్రా ప్రభుత్వం ఒక జీవో 134 రిలీజ్ చేసింది. ఆయుష్ విద్యుర్థులకు మోడ్రన్ మెడిసిన్ లో ట్రైనింగ్ ఇవ్వాలని ఆ జీవో సారాంశం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా  ఇలాంటి జీవో రాలేదు. ఆంధ్రా IMA నాయకులు సకాలంలో స్పందించి తమ వ్యతిరేకతను బలంగా తెలియ చెప్పడం తో ప్రభుత్వం ఎంతో దయతో ఆ జీవో ని నిలిపివేసింది.
  • 21.ఒక పక్క అర్బన్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను,డ్రైనేజి సెస్సు కట్టించుకొంటూ, చెత్తపై పన్నువేసి, హాస్పిటల్స్ నుండి 1000/ నుండి 10000/- వసూల్ చేయడం చట్ట వ్యతిరేకం కాదా? ఇప్పటికే బయో సేఫ్టీ సంస్థలకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి పన్నులు, వినియోగ చార్జీలు కడుతున్న హాస్పిటల్స్ పై మళ్ళీ  చెత్త పన్ను వేయడం అన్యాయం కాదా?

 

  ప్రభుత్వాలను కేవలం విమర్శ చేస్తే అది సద్విమర్శ అనిపించుకోదు. కాబట్టి కొన్ని సూచనలు చేయడం కనీస బాధ్యత.  మోడ్రన్ మెడిసిన్ ని కాపాడుకోవాలనే చిత్త శుద్ధి ప్రభుత్వాలకు నిజంగా ఉంటే, క్రింది సూచనలను కనీసం పరిశీలించండి. 

  • ఏ డాక్టర్ తో వైద్యం చేయించు కోవాలో, ఏ హాస్పిటల్ కి పోవాలో నిర్ణ యించుకొనే లిబర్టీ రోగికి ఉండాలి. చిన్నపాటి జ్వరాలకు, సెకండరీ కేర్ అవసరాలకు 200 మైళ్ళు ప్రయాణం చేసి నగరాల లో ఉండే నెట్ వర్క్ హాస్పిటల్స్ కి  పోవాలంటే ప్రజలకు కష్టం అవుతుంది. కాబట్టి చిన్న పట్టణాలలోని చిన్న హాస్పిటల్స్ ను కూడా ఎంపానెల్ చేసి ప్రయిమరీ ,సెకండరీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు.  
  • కేంద్రప్రభుత్వం, బయో సేఫ్టీ నియమ నిబంధనలను సవరించాలి. హాస్పిటల్స్ పరిశ్రమలు కాదని గుర్తుమ్చు కోవాలి. మధ్యస్థాయి హాస్పిటల్స్  (STP)SOLID WASTE PROCESS PLANT నిర్మించు కోవాలంటే ఎంతఖర్చు ఎంత కష్టమో ప్రభుత్వాలు ఆలోచించాలి.  నిబంధనలు ప్రాక్టికల్ గా ఉండాలి. లేకుంటే లంచాలు ,మామూళ్లతో డిపార్ట్మెంట్ వాళ్ళు డాక్టర్లను దోచేస్తారు. 
  •  వైద్య సేవలను వినియోగదారులరక్షణ చట్టం CPA 2019 నుండి పూర్తిగా తొలగించాలి. మెడికల్ నిర్లక్ష్యం కేసులకు కోర్టులు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్స్ సరిపోతాయి. 
  • 30 బెడ్స్ లోపు ఉన్న హాస్పిటల్స్ ను చిన్న హాస్పిటల్స్ గా పరిగణించి  వాటికి విద్యుత్ ,ఆస్తి పన్ను ,నీటి పన్ను , రాష్త్రం పరిధిలో ఉండే తదితర పన్నులను వ్యాపార కేటగిరీ నుండి తప్పించి నివాస కేటగిరీ కి మార్చాలి. 
  • ప్రయిమరీ కేర్, ప్రివెంటివ్ కేర్ రంగం లో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండాలి. సెకండరీ కేర్ , టెరిషియరీ కేర్ లో 50 శాతం  ప్రభుత్వరంగం లో ఉండాలి. అప్పుడే ప్రవేట్ మార్కెట్ శక్తులు అదుపులో ఉంటాయి. 
  • ఎమర్జెన్సీ మరియు క్రిటికల్  సేవల కోసం ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ను  ప్రతి మెడికల్ కాలేజీలో ఉండే టట్లు నిబంధనలు సవరించారు. ఇవి త్వరగా కార్యరూపం దాల్చేటట్లు చూడాలి. 
  • కేంద్ర మెడికల్  రక్షణ చట్టం చేసి, ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా అవసరమైన సెక్షన్ల ను ప్రవేశపెట్టి కఠినమైన  శిక్షలు ఉంటే తప్ప  హాస్పిటల్స్ పై దాడులు అదుపు చేయలేము . 
  • NMC ACT జాతీయ వైద్య కమిషన్ చట్టం లోని  - 10 ,15, 31/8 , 32,  50,51, 65 - సెక్షన్లను పూర్తిగా తొలగించాలి. 
  • CCIM (ఆయుర్వేద సర్జరీ) నోటిఫికేషన్ ను రద్దు చేయాలి. 
  • యాంటీ క్వాకరీ చట్టాలను   కఠినం గా అమలు చేయాలి. 
  • క్రాస్ పతీ, మిక్సో పతీ ని కఠినం గా అదుపు చేయాలి. 
  • వివిధ వైద్య పద్ధతులను కలిపి కలగూరగంప చేసి కిచిడీ వైద్యము ,సంకర వైద్య విద్యకోసం    నీతి ఆయోగ్ నియమించిన 4 కమిటీలను తక్షణం రద్దు చేయాలి . 
  •   మెడిసిన్స్ పై  క్వాలిటీ నియంత్రణ జిల్లా స్థాయిలో పటిష్టం చేయాలి. 
  •  ఒక మాలిక్యూల్ ను జనరిక్ , బ్రాండ్ అనే పాకింగ్ తో  ఒక కంపెనీ తయారు చేసినప్పుడు , వాటిపై ఒకే విధమైన  ధర ప్రింట్ చేయాలి. 
  • అన్నింటికంటే అతిముఖ్యమైన సూచన - మనదేశ జి డి పి లో 2 శాతం ఆరోగ్యసేవారంగానికి, మరో 2 శాతం పబ్లిక్ హెల్త్ కోసం ,మరో 2 శాతం సేఫ్ వాటర్ మరియు ఎయిర్ కోసం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయించాలి. 

 ప్రజారోగ్య సంక్షేమం కోసం మనదేశ నాయకులు ఒక్క క్షణం మనసుపెట్టి ఆలోచిస్తే ఇంతకంటే మంచి సలహాలు అందించేవారు మనదేశంలో చాలామంది ఉన్నారు. 

 అదృష్టవశాత్తు భారతీయులకున్న మంచి రోగనిరోధక శక్తి వలన కోవిద్ మహమ్మారిని అదుపు చేయగలిగాం . ప్రభుత్వాలు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశాయి. ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది , అందరికంటే ముందు మా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ,  ఆరోగ్యసేవకులు చేసిన సేవలు,త్యాగాలు చరిత్ర మరచిపోదు. 

మోడీ లాంటి నిరంతర శ్రామిక తత్త్వం, త్యాగ బుద్ధి ఉన్న నాయకుని  పాలన లో ఆరోగ్యరంగం లో మనదేశం పురోగతి పొంది ఆరోగ్యభారత్ గా పరిఢవిల్లాలని కోరుకొంటూ ... 

మీ 

డా. శ్రీనివాస రాజు 

రాష్ట్ర అధ్యక్షుడు 

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ -ఆంధ్ర ప్రదేశ్

9490172569 


Comments