Skip to main content

దేశం లోని అనారోగ్యానికి ప్రభుత్వాలే కారణమా?

 దేశం లోని అనారోగ్యానికి ప్రభుత్వాలే కారణమా? లేక  కేవలం తాయిలాలకోసం ఆశపడి ఓటును దుర్వినియోగం చేసుకొంటున్న ప్రజలా ?  
రండి, కాస్త ఓపిగ్గా చదవండి!

మన దేశ సరిహద్దులను  రక్షించడానికి 20 లక్షల సైనికులు పనిచేస్తున్నారు.
మన దేశ అంతర్గత భద్రత కోసం 20 లక్షల మంది పోలీసులు పనిచేస్తున్నారు.
మరి 140కోట్ల జనాభా ఆరోగ్యరక్షణ కోసం ఎంతమంది వైద్యులు పనిచేస్తున్నారు?
కేవలం ఒక లక్ష మంది డాక్టర్స్ ,4లక్షలమంది నర్సింగ్ సిబ్బంది వెరసి 5 లక్షల ప్రభుత్వ ఆరోగ్య రక్షకులు 140కోట్ల జనాభా ఆరోగ్యాన్ని కాపాడ గలరా?
ప్రవేట్ రంగం లో మరో 15 లక్షలమంది వైద్యులు( ఆయుష్ మరియు మోడ్రన్ కలిపి),నర్సింగ్ సిబ్బంది  పనిచేస్తున్నారుగదా ?ప్రభుత్వఆరోగ్యశాఖ లో పనిచేసే ఒక ఉద్యోగి సమర్ధన!
ప్రవేట్ వైద్యాన్ని మన పేదలు భరించగలరా? భరించలేరని నాయకులు,మీడియా సోదరులు ఎలుగెత్తి బాధపడుతున్నారు గదా!

  •  60%  జనాభా పేదరికం లో మగ్గుతున్నప్పుడు , మరో 30% మంది మధ్యతరగతిలో ఏడవలేక నవ్వుతూ బతుకీడుస్తున్నప్పుడు ప్రభుత్వాలు మరింతగా వైద్యులను,నర్సులను, రిక్రూట్ చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్స్ సంఖ్య ను పెంచాలా? వద్దా ?
  • WHO ప్రకారం 1000 మంది జనాభాకి ఒక డాక్టర్ ఉండాలి.   ప్రభుత్వ,ప్రవేట్ డాక్టర్స్ ఆదర్శ (ideal) నిష్పత్తి 1:1 అనుకొంటే, ప్రతి 2000 మంది జనాభాకి ఒక ప్రభుత్వ డాక్టర్,ఒక ప్రెవేట్ డాక్టర్ ఉండాలి. అలా ఉన్నప్పుడే దేశము  ఆరోగ్యం గా ఉంటుంది. కానీ నేడు ప్రతి 11000 మంది జనాభాకి ఒక్క ప్రభుత్వ డాక్టర్ మాత్రమే పనిచేస్తున్నారు. 
దీనివలన ప్రజలకు భారం పెరుగుతుందా?లేదా ?
పెరుగుతుంది!
 ప్రతి భారతీయుడు సరాసరి గా ప్రతి ఏటా తమ ఆరోగ్యరక్షణకోసం Rs.20000/ ఖర్చు పెడుతుంటే ఇందులో కేంద్రప్రభుత్వం 600/-,రాష్ట్ర ప్రభుత్వం 1400/ వెరసి కేవలం  2000/-మాత్రమే సాయం అందిస్తున్నాయి .
అనగా నలుగురు సభ్యులున్న  ఒక సాధారణ భారతీయకుటుంబం (సుమారు 2+2) ప్రతి ఏటా తమ సేవింగ్స్ నుండి 72000/- ఆరోగ్యం కోసం ఖర్చుపెడుతున్నాయి. మనకు తెలుసు,మన దేశం లో ప్రజల  తలసరి సాలుసరి ఆదాయం కేవలం ఒక లక్ష రూపాయలు. కుటుంబం లో ఇద్దరు పనిచేస్తున్నారనుకొంటే ఆ కుటుంబ ఆదాయం 2లక్షలు. ఇందులో 72000/- కేవలం ఆరోగ్య సంరక్షణ కే ఖర్చు ఐతే పౌష్టికాహారం ఎలా అందుతుంది.మిగతా అవసరాలు ఎలాతీరతాయి?దీనికి తోడు మత్తుమందులు, సారాయి,బీడీ,పాన్ లాంటి  దురలవాట్లు ఈ కుటుంబాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. శవాలపై పేలాలు ఏరుకొంటున్నట్లు ,ప్రభుత్వాలు సారా,గుట్కా లపై ఇబ్బడి ముబ్బడి గా పన్నులు విధించి ఆదాయాన్ని పెంచుకొంటున్నామని మురిసి పోతున్నాయి .

  • ప్రభుత్వాల అనాలోచిత చర్యల వలన ఆరోగ్య భారతం అనేది ఒట్టి కల గా వట్టి పోతుంది.  దీనికి తోడు విలువలు లేని విద్య! 
  •  మాతృభాష పై మమకారాన్ని పక్కనబెట్టి కేవలం శాస్త్రీయ దృక్కోణం తో ఆలోచించినా , 5 వ క్లాస్ వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరపాలనే ఇంగితం కూడా కోల్పోతున్నాయి ప్రభుత్వాలు.

  •  ప్రస్తుతం (2022) మన దేశం లో -1.5 లక్షల సబ్ సెంటర్స్ , 25000 PHC లు  6000 CHC  లు,1200 ఏరియా లేదా సబ్ డివిజనల్ హాస్పిటల్స్, 750 జిల్లా హాస్పిటల్స్  పనిచేస్తున్నాయి. 
1.5 లక్షల సబ్ సెంటర్స్ లో సుమారు 2 లక్షల ANM లు పనిచేస్తున్నారు . 
25000 PHC లలో 30000 మంది డాక్టర్స్ పనిచేస్తున్నారు. 
6000 CHC లలో వాస్తవానికి 30000 మంది స్పెషలిస్ట్ లు పనిచేయాలి. కానీ ప్రస్తుతం కేవలం 5000 మంది పనిచేస్తున్నారు. 
అంటే సుమారు 25000 స్పెషలిస్ట్ ల కొరత ఉంది. ఇంకెప్పుడు రిక్రూట్ చేసుకొంటారు?

  •  ప్రాధమిక ,అత్యవసర (emergency medicine)ఆరోగ్యరంగం లో  మౌలిక సదుపాయాలు మెరుగు పరచకుండా, ఆయుష్మాన్ భారత్ ,ఆరోగ్యశ్రీ అనీ పధకాలు పెట్టినంత మాత్రాన ఏమి లాభం? సింహ భాగం సేవలన్నీ ప్రవేట్ రంగము ద్వారా పొందవలసిందే గదా?
  • 70% సీజనల్ వ్యాధులే మనిషిని కుంగదీస్తాయి.మానవ పనిదినాల నష్టానికి కూడా ఇవే కారణం.  వీటికి బడా బడా హాస్పిటల్స్ ఏమీ అక్కరలేదు. ఫీవర్ క్లినిక్ లు, లాబ్ కియోస్క్ లు విరివిగా ఏర్పాటు చేసి ముఖ్యం గా వైరల్ జ్వరాలను లేతదశలోనే మానేజ్ చేయగలిగే మామూలు హాస్పిటల్స్ ( family clinics) ఏర్పాటు చేస్తే చాలు.
  • ప్రాధమిక వైద్య రంగం లో మౌలిక సదుపాయాలైనా సరిపడా ఉన్నాయా ? అవీ లేవు. మందుల కొరత ,వనరుల కొరత ,బిల్డింగ్ ల కొరత , సిబ్బంది గైర్హాజరు సరేసరి!స్పెషలిస్ట్ ల కొరత ఎక్కువగా ఉంది.మెజారిటీ స్పెషలిస్ట్ లు  ప్రవేట్ ప్రాక్టీస్ వైపు మొగ్గు చూపడానికి కారణం, ప్రభుత్వ ఆరోగ్యరంగం లో ని లోటుపాట్లు, మౌలిక సదుపాయాలు,సిబ్బంది కొరత, తక్కువజీతాలు !
  • ప్రభుత్వ దవాఖానా లలో శుభ్రత ఏమైనా ఉంటుందా? ఆబ్బె, కుక్కలు,ఎలుకలు స్వేచ్ఛగా తిరుగాడే హాస్పిటల్స్ ఈ ప్రపంచం లో ఎక్కడైనా ఉన్నాయంటే అవి మనదేశంలోనే!
  • కనీసల్ హాస్పిటల్ బెడ్స్ సరిపడా ఉన్నాయా? Estimates suggest approximately 19 lac hospital beds, 95 thousand ICU beds and 48,000 ventilators are available in India. ఈ 19 లక్షల బెడ్స్ లో ప్రవేట్ రంగం లోనే 12 లక్షల బెడ్స్ ఉన్నాయి . 
  • సరిపడా హాస్పిటల్స్ ఉన్నాయా? ప్రవేటురంగం లో 50000 హాస్పిటళ్ళు , ప్రభుత్వరంగం  లో 25000 హాస్పిటల్స్ వెరసి 75000 హాస్పిటల్స్ ఉన్నాయిగానీ ఇవి మన జనాభాకి ఏమాత్రం చాలవు. 

Farmers, workers, marginalised unite against Modi government ...ఆయా రాష్ట్రాలలోని మెడికల్ కాలేజీ సంఖ్యకు , "డాక్టర్ -జనాభా నిష్పత్తికి" సంబంధం ఉంటుంది. 

  • మోడ్రన్ వైద్యం  ఎక్కువగా లాబ్, XRAY  మెషీన్ లపై ఆధారపడుతుందని  తెలిసీ వీటిని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం హాస్యాస్పదం కాదా?
  • కనీసం మొబైల్ లాబ్ లు ,మొబైల్ XRAYవాహనాలు , మొబైల్ సాంపుల్ కలెక్షన్ తోపాటు హబ్ & స్పోక్ పధ్ధతి లో సెంట్రల్ లాబ్ ను జిల్లా స్థాయిలోనైనా ఏర్పాటు చేయడం కనీస కర్తవ్యమ్.
  • చిన్న టాబ్ ద్వారా 36 రకాల ఆరోగ్య పరీక్షలు చేయవచ్చు. ఇలాంటి మెడికల్ డివైస్ లను ఆశా వర్కర్స్ కూడా ఉపయోగించగలరు. వీరి ద్వారా ఒక చిన్న గ్రామీణ కమ్యూనిటీ లో క్రానిక్ డిసీజ్ లు, ఫీవర్స్ కి  అవసరమయ్యే టెస్ట్ లు కూడా చేసి,ఆ రిపోర్ట్స్ ను వాట్సాప్ ద్వారా సెంట్రల్ కమాండ్ సెంటర్ కి  పంపి  స్పెషలిస్ట్ ల సలహా ను పొందవచ్చు.  టెలిమెడిసిన్ అంటే ఇదే గదా !
  • సీజనల్ వ్యాధులను లేతదశలోనే గుర్తించడానికి ముఖ్యం గా డెంగ్యూ, గున్యా, టైఫాయిడ్, మలేరియా, ఫ్లూ  తదితర జ్వరాల ను లేత దశలోనే గుర్తించి తగుచికిత్స  చేసేటట్లుగా  104 మొబైల్ వాహనాలను  అప్ గ్రేడ్ చేయాలి.

  • 108 & 104 సిబ్బంది మొత్తానికి బేసిక్ లైఫ్ సపోర్ట్ నైపుణ్యాన్ని ట్రైన్అప్  చేయాలి.
  • జిల్లా స్థాయిలో ఎమర్జెన్సీ చికిత్సలు అందించే సత్తా ఉన్న క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయాలి.

  •   పబ్లిక్ హెల్త్ ( ప్రివెంటివ్ ప్రజారోగ్యము, శానిటేషన్) ,హెల్త్ కేర్ డెలీవరీ ( హాస్పిటల్స్ ), ఫార్మా ,మెడికల్ డివైస్ లు, మెడికల్ రీసెర్చ్ - ఈ 5 విభాగాలూ కలిసి ఏర్పడిన ఆరోగ్య రంగాన్ని ఇంకెప్పుడు అభివృద్ధి చేస్తారు?
  • నకిలీ మందులు,నకిలీ డాక్టర్స్, నకిలీ వైద్యం .. వీటి గురించి ఏ ప్రభుత్వమైనా, ఏ మీడియా సంస్థ అయినా, ఏNGO అయినా ఆలోచన చేసిందా? ఎంతసేపూ ప్రవేట్ డాక్టర్స్ పై పడి ఏడవటం తప్పించి ఈ నకిలీలను ఎలా కంట్రోల్ చేయాలో చెప్పవు .
  • అంతెందుకు, నకిలీ వైద్యం చేసే వ్యక్తులకే తర్ఫీదిచ్ఛేసి  వారితో ప్రజలకు వైద్యం చేయించడానికి కూడా ప్రభుత్వాలు వెనుకాడటం లేదు. భారతదేశంలో పక్షులు,పశువులకు కూడా క్వాలిఫైడ్ వెటర్నరీ డాక్టర్స్ వైద్యం చేస్తారు. కానీ పల్లె ప్రజలు ఏమి పాపం చేశారని వారికి  నకిలీవైద్యం  చేయించడానికి ప్రభుత్వాలు ఉబలాటపడుతున్నాయి?

  • జాతికి ఆరోగ్యమే మహాభాగ్యం . అందుకే అన్నిరంగాల కంటే ఎక్కువగా  ఆరోగ్యరంగానికి ప్రయారిటీ ఇవ్వాలి.ప్రశాంతంగా వైద్యం చేద్దామంటే అవసరమైన వాతావరణాన్ని కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఎంత?పోతే ఎంత? పూర్వం వైద్య వృత్తిపై గౌరవం ఉండేది. పిల్లలు డాక్టర్ అవ్వాలని కలలు కనేవారు . కానీ ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయింది.  డాక్టర్ చదివి తన్నించు కోవడం,పొడిపించుకోవడం కంటే మరేదైనా వృత్తి ని ఎంచుకొంటున్నారు. 

  • వినియోగ దారుల రక్షణ చట్టాన్ని(CPA act) అడ్డుపెట్టుకొని ప్రతి లిటిగెంటూ  డాక్టర్స్ ను బ్లాక్ మెయిల్ చేస్తుంటే కనీసం వైద్య వృత్తిని ఆ చట్టపరిధినుండి తప్పించి వెసులుబాటు కలిగించే సహృదయత లేని ప్రభుత్వాల ను ఏమని పిలవాలి?

  • గుండాలు, వైద్యులను చితక్కొడుతుంటే ఏదో కంటి తుడుపుగా నాలుగు స్టేట్ మెంట్లు ఇచ్చేసి చేతులు దులుపు కొంటున్న ప్రభుత్వాల కు వైద్యులంటే పిసరంత కూడా గౌరవం లేదు.

  • "మెడికల్ రక్షణ చట్టం చేసి, IPC లో తగు సెక్షన్ లను చొప్పించి  వైద్య వృత్తిని రక్షించండి మహాప్రభో" అంటూ ఎలుగెత్తి అరచినా చూద్దాం,చేద్దాం అంటూ కాలం గడుపుతున్న నాయకులు,సందు దొరికితే చాలు డాక్టర్స్ ను నానా తిట్లూ తిట్టేస్తారు.

  • ప్రభుత్వ వైద్యులంటే , ప్రభుత్వాలు ఎంత చులకనగా ప్రవర్తిస్తాయో గత దశాబ్ద కాలం గా చూస్తూనే ఉన్నాం.మిగతా ఉద్యోగులందరికీ PRC అమలు చేసి ,ప్రభుత్వ వైద్యులకు ఎందుకు చేయరు ?వైద్య వృత్తి అంటే ఇంత అలుసా?

  • టీచర్స్ కి UGC Scales అమలుచేసి,మెడికల్ కాలేజీ లలో పని చేస్తున్నAsst.Professors కి అమలు చేయని ప్రభుత్వాలను ఏమనాలి?PGడిప్లొమా చేసి ఎన్నో ఏళ్ల అనుభవమున్న డాక్టర్స్ టీచింగ్ చేయడానికి పనికిరారని  M.Scవాళ్లనే ప్రొఫెసర్ లుగా నియమించుకొంటామనే ప్రభుత్వాలను ఏమని పిలవాలి?

  • ఒక సైనికుడు వీరస్వర్గం అలంకరిస్తే మనందరం గౌరవ వందనం చేస్తాం. మరి ఈ కోవిడ్ యుద్ధం లో అసువులు బాసిన ఒక్క డాక్టర్ కుటుంబాన్ని మన నాయకులెవరైనా పరామర్సించారా ?  గౌరవ వందనం పక్కన బెట్టండి,కనీసం గాయపడిన  కుటుంబాలకు ఆర్ధిక సాయాన్ని  ప్రభుత్వాలు అందించాయా ?కనీసం కోవిద్ భీమా డబ్బులు ఇప్పించాయా? 

  • ఎపిడెమిక్ ని  కంట్రోల్ చేయడానికి కేవలం HR మానేజ్ మెంట్ లో అనుభవమున్న IAS ఆఫీసర్లు సరిపోరు .  దానితో పాటు మెడికల్ పరిజ్ఞానం ఉన్నప్పుడే సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకే ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ను (IMS) పునరుద్ధరించమని ప్రభుత్వానికి మొర పెట్టుకొంటున్నాం.

  • మెడికల్ కౌన్సిల్ లో అవినీతి,అక్రమాలు జరిగిపోయాయని గగ్గోలు పెట్టిన ప్రభుత్వానికి మిగతా ఏ డిపార్ట్ మెంట్ లోనూ అవినీతి కనబడలేదా? 
  • మెడికల్ మాఫియా కనుసన్నలలో  జాతీయ మెడికల్ కమిషన్(NMC) పనిచేస్తుందనే ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉందా ?
  • ప్రజాస్వామ్య బద్ధమైన నియంత్రణా మండలి స్థానం లో నిరంకుశ అప్రజాస్వామిక సంస్థ  వైద్య విద్యలో నాణ్యతను పెంచక పోగా దోపిడీకి తెర లేపి ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందనే అనుమానాలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం ఉందా ? 

  • ప్రయారిటీ అనేది నాయకుడికి తెలియాలి. విద్యా, వైద్యం, న్యాయం అనే మూడింటినీ  సత్వరం గా అందించే మౌలిక సదుపాయాలు, మానవ వనరులను పరిపుష్టం చేయడమే, ఏ దేశానికైనా  మొదటి ప్రయారిటీ. 
అపర చాణుక్యులైన మన నాయకులకు కూడా ఈ విషయాలు తెలుసు. కానీ వారి ప్రయారిటీ కేవలం ఓట్లు,ఎలక్షన్లు !
అమాయకత్వం నేరం కాదు గానీ మూర్ఖత్వం మాత్రం నేరమే!  

Comments