Skip to main content

ప్రవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేయడం నిజమేనా?

ప్రవేట్ హాస్పిటల్స్ దోపిడీ  ,  వైద్యుల నిర్లక్ష్యం, వైద్యులను తన్ని తగలెయ్యాలి , కార్పొరేట్ వైద్యం బందిపోటు దోపిడీ  ... ఇవీ గత 2 దశాబ్దాలుగా మన దేశం లోని పేపర్లలో ప్రధాన శీర్షికలు. 
ఈ వార్తల్లో నిజమేమన్నా ఉందా? పరిశీలిద్దాం.. 

ప్రెవేట్ వైద్యం నాణ్యమైనదే అని మెజారిటీ ప్రజల అభిప్రాయం. కానీ పేదలకు అందుబాటులో లేనప్పుడు ఏమి ప్రయోజనం ? అని ఒక పాత్రికేయుడి ప్రశ్న. 
                 ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ ఆరోగ్యబీమా సంక్షేమ పధకాల ద్వారా దేశ జనాభాలో 50 % అనగా సుమారు 70 కోట్లమంది పేదలు  భీమా నెట్ వర్క్ హాస్పిటల్స్ లో వైద్యాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా టెరిషియరీ కేర్ ,సెకండరీ కేర్ కి సంబంధించిన వైద్య సేవలను 70 కోట్లమంది పేద వారు ప్రభుత్వ ఆరోగ్యబీమా సంక్షేమ పధకాల ద్వారా పొందుతున్నారు. మరో 15 కోట్లమంది ( ఉద్యోగస్తులు , మధ్యతరగతి వారు )తాము సొంతంగా ప్రీమియం లు కట్టుకొని ఆరోగ్యబీమా పొందుతున్నారు. వాస్తవానికి కార్పొరేట్ హాస్పిటల్స్ లో మెజారిటీ సేవలు ఈ 15 కోట్లమందికే అందుబాటులో ఉంటాయి. 
పేదవారు కూడా ఈ కార్పొరేట్ వైద్యానికి మొగ్గు చూపుతున్నప్పుడే ఎక్కువ ఇబ్బందులు,ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాలు తమ ప్రభుత్వ  హాస్పిటల్స్ లో నాణ్యత,శుభ్రత,నైపుణ్యత  లోపించాయనే ఉద్దేశ్యం తో కార్పొరేట్ హాస్పిటల్స్ ను కూడా తమ ప్రభుత్వ ఆరోగ్యబీమా నెట్ వర్క్ హాస్పిటల్స్ గా ఎంపానెల్ చేసుకొంటున్నాయి. 

  • అత్యవసర వైద్య చికిత్స లో ప్రభుత్వ వాటా పెరగ నంతవరకు కార్పొరేట్ హాస్పిటల్స్ కి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. 
  • వైద్యసేవలను వాణిజ్య కార్యక్రమాలుగా ప్రభుత్వాలు పరిగణిస్తూ ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వేసి నడ్డివిరిచినంత  కాలం ప్రవేట్ వైద్యం లాభాపేక్షతో నడుస్తుంది . 
  • చిన్న చిన్న హాస్పిటల్స్ ను కూడా 36 రకాల చట్టాలతో నియంత్రణ చేస్తున్నంత కాలం ప్రవేట్ వైద్యం ఖరీదుగానే ఉంటుంది. 
ఇవన్నీ కాదనలేని సత్యాలు.  

ప్రాధమిక వైద్యం, అత్యవసర వైద్యం , అంటురోగాల నియంత్రణ ...ఈ మూడు విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు.
గత 70 ఏళ్లుగా బడ్జెట్ లో  మన దేశ సాలుసరి ఉత్పత్తి (GDP) విలువలో కేవలం  ఒక్క శాతం ఆరోగ్యరంగానికి కేటాయించే ప్రభుత్వాల కు ఆరోగ్యరంగం పై శ్రద్ధ ఉన్నదంటే ఎవ్వరూ నమ్మరు!
అతిముఖ్యమైన ఆరోగ్యరంగాన్ని ప్రవేట్ రంగానికి, భీమాకంపెనీలకు  వదిలివేయడం అత్యంత గర్హనీయం. ప్రభుత్వ పాత్ర ఎక్కువగా ఉండవలసిన రంగాలు రెండు- అవి విద్యా వైద్య రంగాలు. ఆ రంగాలను  మార్కెట్ శక్తులకు వదిలేసి  ఏమాత్రం లాభం లేకుండా చౌకగా  సేవలను అందించమని ప్రవేట్ రంగాన్ని హుకుం చేయడం ప్రభుత్వ దివాళా కోరుతనం తప్ప మరేమీ కాదు.

ఈ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయా?
లేకేం ప్రభుత్వాలకు సంకల్పం ఉంటే అన్నీ సాధ్యమే!కేవలం 5నెలల్లో  100 వైరల్ లాబ్స్ నుండి 1500 లాబ్స్ ,  లక్షల  ఆక్సిజన్ బెడ్స్  ఏర్పాటు చేయడం..  నాయకత్వం తలచుకొంటే అన్నీ సాధ్యమే నని అర్ధం అవుతుంది. 

 1. క్వాలిఫైడ్  డాక్టర్ పర్యవేక్షణలో పనిచేసే ప్రాధమిక వైద్య కేంద్రాలనేవి ప్రతి గ్రామం లో ఉండాలి. అలాంటిది ఎప్పుడో 70 ఏళ్ళక్రితం జనాభా కి సరిపోయే నమూనానే ఇంకా అనుసరిస్తూ 50 గ్రామాలకు ఒక కేంద్రం రన్ చేయడం  క్షమించరాని  నిర్లక్ష్యము.
2.  స్వతంత్రం వచ్చి 75 ఏళ్ల తర్వాత , డిజిటల్ టెక్నాలజీ ఇంతగా పెరిగినతర్వాత, 500 మెడికల్ కాలేజీల నుండి ఏటా 75000 మంది  MBBS డాక్టర్స్ , 300 AYUSH  కాలేజీలనుండి 50000 మంది AYUSH  వైద్యులు పట్టా తో  బయటకు వస్తున్న సమయం లో కూడా ఇంకా పాత నమూనానే పట్టుకు వేలాడటం గర్హనీయం.
140కోట్లజనాభా ఉన్న దేశం లోని 6 లక్షల గ్రామాలకు 6 లక్షల   ప్రాధమిక కేంద్రాలు ఉండవలసిందే!
వీటికోసం 6 లక్షల MBBS/ AYUSH డాక్టర్స్ ను రిక్రూట్ చేసుకొని తీరాలి.
6లక్షల వైద్య కేంద్రాలకు సొంతభవనాలు , వాటర్,కరెంట్ సప్లై, మందుల సరఫరా, ఎక్స్ రే కేంద్రం, లాబ్ తదితర మౌలిక సదుపాయాలతో పరిపుష్టంగా ఉండితీరాలి.

3. నకిలీ మందులను అరికట్టడం లో గానీ, ప్రాణాలను కాపాడే మందుల నాణ్యత మరియు  సరఫరా లోగానీ, మెడికల్ డివైస్ ఉత్పత్తిలో గానీ, మెడికల్ రీసెర్చ్ లో గానీ ఇలా ఏది చూసినా  ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చి నట్లుగా కనబడుతున్నా , తమతీరుని మార్చుకోలేక పోతున్న నాయకత్వము తమ వైఫల్యాలను ప్రవేట్ వైద్యరంగం పై ముఖ్యంగా ప్రవేట్ డాక్టర్స్ పై తోసేయడానికి బాగా అలవాటు పడిపోయింది. ఆత్మ నిర్భర్,  స్వచ్ఛ భారత్, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ - అనేవి కేవలం స్లొగన్స్ గానే మిగిలిపోయాయి. కనీసం విద్యా,వైద్యా,దేవాలయాలలో  పరిశుభ్రత లేకుంటే  దేశం ఎలా బాగుపడుతుంది? ప్రాణాలు కాపాడే మందులను కూడా మంచి క్వాలిటీ తో అందించలేని ప్రభుత్వం ఏవేవో పెద్ద పెద్ద కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మరు. 
"ఎప్పుడైతే అధికారులు,నాయకులు నిర్భయం గా  ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యం తీసుకొంటారో అప్పుడే సామాన్య ప్రజలలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ పై నమ్మకం కలుగుతుంది". 

4. ఓట్లకోసం ఆరోగ్యబీమా పధకాలు పెడతారు గానీ తమ పరిధిలోని హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు  కల్పించి ప్రజల విశ్వాసాన్ని చూర గొనాలనే ఉదేశ్యం ఏ  మాత్రం ఉండదు.

5. ప్రవేట్ వైద్యరంగానికి ప్రభుత్వాలు చేసే సాయం ఏమన్నా ఉందా అంటే అదీ లేదు. 
ఇప్పటికీ ప్రజలు ప్రవేట్ వైద్యానికే మొగ్గు చూపడానికి కారణం అందరికీ తెలుసు. 
దేశంలో దాదాపు 7 దశాబ్దాల అనంత‌రం కూడా వైద్య సేవల విష‌యంలో ప్ర‌జ‌లు ప్రైవేటు ఆసుప‌త్రుల‌పైన‌నే ఆధార‌ప‌డుతున్నార‌ని, ఈ విష‌యంలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేద‌ని ఒక అధ్య‌య‌నంలో వెల్ల‌డ‌య్యింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (నాసో) తాజా నివేదిక ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు ప్రభుత్వ వైద్య సేవలపై, పట్టణ ప్రాంతాల్లోని జ‌నాభా ప్రైవేట్ వైద్య సేవలపై ఆధారపడటమ‌నేది మ‌రింత‌గా పెరిగింది. మ‌రోవైపు పట్టణ జనాభాలోని 65 % మంది ప్రైవేటు ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నార‌ని వెల్ల‌డయ్యింది. నాసో ఇటీవల విడుదల చేసిన నివేదికలో 54 శాతం గ్రామీణ ప్రజలు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్ర‌యిస్తుండ‌గా, 46 %  ప్ర‌జ‌లు ప్రభుత్వ ద‌వాఖానాల‌కు వెళుతున్నారు.ప్రవేట్ వైద్యం గ్రామాలలో కూడా లభ్యమైతే వీరు కూడా ప్రవేట్ వైద్యానికే వెళతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. 
నాసో సర్వే ప్రకారం దాదాపు 22 సంవత్సరాల తరువాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవల పరిధి కేవలం రెండు శాతం మేర‌కు మాత్రమే పెరిగింది. పట్టణ జనాభాలో 65 శాతం మంది జ‌నాభా ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతుండ‌గా, 35 శాతం ప్ర‌జ‌లు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. 22 సంవత్సరాల క్రితం నాటి గణాంకాలను పరిశీలిస్తే అప్ప‌ట్లో పట్టణ జనాభాలోని 57శాతం మంది ప్రైవేట్ ఆసుపత్రులలో, 43 శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందేవారు. ప్ర‌స్తుతం పట్టణ ప్రాంతాల్లో పెరిగిన జనాభా ప్రాతిప‌దిక‌న ప్ర‌భుత్వ‌ వైద్య సదుపాయాలు పెరగలేదని స్పష్టంగా వెల్ల‌డ‌య్యింది. ఫ‌లితంగా నగరాల్లో ఉంటున్న ప్ర‌జ‌లు ప్రైవేట్ వైద్య సేవలపై ఆధారపడుతున్నార‌ని తేలింది. 

6. ఒక హాస్పిటల్ కట్టి, రన్ చేయాలంటే స్థలం కొని ,భవనం కట్టి, ఖరీదైన పరికరాలు సమకూర్చుకొని హాస్పిటల్ సిబ్బందిని నియమించుకొని ,వైద్యసేవలు అందించాలంటే ఎంత కష్టమో ఒక్క సారి పరిశీలిద్దాం.
ఒక సాధారణ హాస్పిటల్ ను ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నిర్మాణం చేసి రన్ చేయాలంటే సుమారు 36 రకాల చట్టాలకు లోబడి పనిచేయాలి.
స్థలం రిజిస్ట్రేషన్  నుండి పరికరాల దిగుమతి వరకు ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వదు.
అగ్ని ప్రమాద నిరోధ చట్టానికి లోబడి  అమర్చుకోవడానికి అవసరమైన పరికరాలపైనా రాయితీ లివ్వదు. పైపెచ్చు అగ్నిమాపక సిబ్బంది చేసే అవినీతిని కూడా అరికట్టలేదు.

  • భవన శిస్తు(PROPERTY TAX) , కరెంట్, వాటర్ పైన  కమర్షియం బిల్లింగ్  వేసి నడ్డి విరిచేస్తుంది.
  • మెడికల్ పరికరాలపై ,మెడికల్ డిస్పోసబుల్స్ పైన అత్యంత ఎక్కువగా GST పన్ను విధిస్తుంది.
  • ఖరీదైన మెడికల్ ఎక్విప్ మెంట్ రక్షణ కోసం కట్టే యాన్యువల్ మెయిన్టైనెన్స్ పైన కూడా ప్రభుత్వాలు ఎలాంటి రాయితీ లివ్వవు.
ఇవన్నీ చెప్పినా అటు  ప్రభుత్వాలు పట్టించుకోవు, ఇటు మీడియా మేధావులకు సరిగ్గా అర్ధం కాదు.
సింపుల్ గా చెప్పాలంటే ,  ఒక హాస్పిటల్ లక్ష రూపాయల బిల్లు వేస్తె , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 60 శాతం అనగా 60000/- పన్నుల రూపంలో కట్టాలి.
7. ఇంతకీ వైద్యం..  పరిశ్రమా ?సేవారంగమా?

  • హాస్పిటల్స్ ను ఒక ఇండస్ట్రీ గా పరిగణిస్తే మిగతా ఇండస్ట్రీ లకు ఇచ్చినట్లుగా రాయితీ లివ్వడం లేదు.
  • హాస్పిటల్స్ ను ఒక సేవా రంగం గా పరిగణిస్తే మిగతా  సేవారంగాలకు ఇచ్చినట్లుగా ఆదాయ పన్ను రాయితీ లివ్వడం లేదు.
అందుకే, 100 మంది సిబ్బందితో  100 కోట్లు పెట్టి  ఒక పెద్ద హాస్పిటల్ నడిపి లాభం గణించడం కంటే , కేవలం 10కోట్ల పెట్టుబడి తో 10 మంది సిబ్బందితో సాఫ్ట్ వేర్ లాంటి సేవారంగానికి చెందిన ఇతర కంపెనీ లు రన్ చేస్తే ఎక్కువలాభం పొంద వచ్చని పరిశీలకుల అంచనా!
బాంకింగ్, లీగల్,ఆడిటింగ్ ,   స్ట్రక్చరల్ డిజైనింగ్, ఆర్కి టెక్చర్ , బోధన , ఫైనాన్స్ .. ఇలా ఏ సేవారంగాన్ని గమనించినా - వైద్యసేవరంగం తో పోల్చుకొంటే,తక్కువ పెట్టుబడి , తక్కువ సిబ్బంది, తక్కువ రిస్క్,  ఎక్కువ లాభాలు!

8. ప్రజలప్రాణాలతో డీల్ చేసే వైద్యులు కూడా తమ ప్రాణాలకు తెగించి వైద్య సేవలందిస్తారని గుర్తుపెట్టుకోవాలి.అత్యంత  సున్నితమైన వైద్య సేవల గురించి దానిలోని లోతుపాతు లు తెలియకుండా తమ పెన్నుకు తోచిన విధంగా పత్రికలలో వ్రాస్తే అది వైద్యరంగాని కేకాదు  ఒక విధంగా సమాజానికే ద్రోహం చేసినట్లుగా భావించాలి.

9. ఆరోగ్యసేవలు పొందేవారు వినియోగదారులని ప్రభుత్వాలు చెప్పడం ఎంతవరకు సబబు? వైద్యాన్నిఎప్పుడైతే  మామూలు వినిమయ వస్తువుగా చూశారో అప్పుడువైద్యం వ్యాపారము గా మారడం లో ఆశ్యర్యమేముంది?

10. ఒక హాస్పిటల్ లో మరణం సంభవించగానే  దుండగులు వైద్యులపైనా,సిబ్బందిపైనా దాడి చేస్తున్నా అటు మీడియా,ఇటు రాజకీయనాయకులు తప్పంతా వైద్యులదేననే అపోహలను పనికట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇదెంతవరకు సబబు? కొన్ని మీడియా సంస్థలకు వాస్తవం అక్కరలేదు. దారుణమైన సెన్సేషన్ గా చిత్రీకరించి ఆయా వైద్యుల బతుకును బజారు కీడ్చేస్తారు. సోషల్ మీడియా లో వైరల్ చేసేసి ఆ హాస్పిటల్ పరువు ఎండ గడతారు.

  • మరణాలు హాస్పిటల్ లో సంభవించకుండా ఎక్కడ  జరుగుతాయి?
  • వైద్యులు కేవలం చికిత్స చేస్తారు తప్ప పోయే ప్రాణాలను ఆపే దేవుళ్ళు కాదుగదా?

11. ప్రభుత్వం తాను హాస్పిటల్స్ కట్టి రన్ చేయలేదు. ప్రవేట్ సెక్టార్ లో ఉన్న కార్పొరేట్  హాస్పిటల్స్ చౌకగా సేవ లందించడానికి అనువైన వాతావరణం కల్పించడం లేదు. ఎన్నోరకాల నియమనిబంధనలు  విధించడం వలన ప్రవేట్  హాస్పిటల్స్ రన్ చేయడం ఖరీదు గా మారింది. ఈ ఖర్చు మొత్తం రోగులపై విధించవలసిన అగత్యం కలుగుతుంది.

12. వైద్య విద్యను ప్రవేట్ మార్కెట్ కి వదిలేశారు. వైద్యబీమాను ప్రవేట్ మార్కెట్ కి ఇచ్చేశారు. 
వైద్యసేవలను ప్రవేట్ మార్కెట్ కి అప్పచెప్పారు.  ప్రభుత్వాలు ఇన్ని తప్పులు చేసి, ఇప్పుడు తప్పంతా ప్రవేట్ వైద్యులదే అంటూ  నెపాన్ని తోసేయడం శోచనీయం.

  • వైద్య విద్య,వైద్య భీమా, వైద్యసేవలలో దోపిడీని అరికట్టాలంటే ఒకే ఒక్క మార్గం -ప్రభుత్వం ఈ మూడురంగాలలో భారీగా పెట్టుబళ్ళు పెట్టి ప్రవేట్ రంగానికి గట్టిపోటీ నివ్వాలి. 
  • మంచి ఆకర్షణీయమైన జీతాలిచ్చి ఆరోగ్య సిబ్బందిని నియమించుకోవాలి. 
  • ప్రభుత్వ హాస్పిటల్స్ లో  శుభ్రత ,సేవలలో  నాణ్యత మెరుగుపరచాలి.
  • ఇవన్నీ సాధ్యపడాలంటే బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించాలి.
విద్య,వైద్య , ఫార్మా రంగాలలో ప్రభుత్వ, ప్రవేట్ వాటా 50 :50 గా ఉన్నప్పుడే సా మాన్యుడికి సరస మైన ధరలో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ నాయకులకు,అధికారులకు తెలుసు. తెలిసినా తెలియనట్లు నటించేవాళ్లకు చెప్పినా ఒక్కటే, చెప్పుకున్నా ఒక్కటే!నిద్ర పోయేవాడిని మేల్కొలప గలము గానీ, నిద్ర నటించేవాడిని లేపలేము!   

Comments