Skip to main content

ప్రజారోగ్య వైఫల్యానికి ఎవరు కారణం?


మనదేశం లో ప్రజారోగ్య మౌలిక వనరులు అనగా హాస్పిటల్స్ భవనాలు , లాబ్స్, కోల్డ్ చైన్, మందుల సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరా, ఆరోగ్య కార్యకర్తలైన డాక్టర్స్ ముఖ్యంగా స్పెషలిస్ట్ లు, నర్స్ లు , టెక్నీషియన్ లు  తదితర సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉందని, వీటిని అభివృద్ధి చేయకుంటే ప్రమాదమని, వీటన్నింటినీ మెరుగుపరచడానికి ప్రతి ఏటా  బడ్జెట్ ను పెంచాలని IMA గత 50 ఏళ్లుగా  ప్రభుత్వాలను హెచ్చరిస్తూనే ఉంది. 
కానీ, అటు కేంద్రం లో గానీ, ఇటు రాష్ట్రాలలో గానీ కాంగ్రెస్,భాజపా,లేదా ఏవో  ప్రాంతీయపార్టీలు గత 70 ఏళ్లలో ప్రజారోగ్య వ్యవస్థపై దృష్టి పెట్టలేదు. 

1. ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019’ ను స్థూలంగా చూస్తే గత దశాబ్దంలో ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం స్థూల దేశియోత్పత్తి (జీడీపీ)లో 1.1 నుంచి 1.2 శాతాన్ని మించలేదు!

2. మన దేశం లోని ప్రభుత్వాసుపత్రులలో పడకల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నదని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయ ‘సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్, పాలసీ’ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. 

3. ప్రభుత్వాసుపత్రులలో 7 లక్షలు, ప్రైవేట్ ఆసుపత్రులలో 12 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయి. ఐసియులు, వెంటిలేటర్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది.

4. ప్రజారోగ్య వ్యవస్థల్లో అంటే ప్రభుత్వాసుపత్రులకు మంజూరైన డాక్టర్లు, ఇతర సిబ్బంది పోస్టులలో అత్యధిక భాగం ఖాళీగా ఉన్నాయనేది సర్వత్రా అంగీకరిస్తున్న ఒక కఠోర వాస్తవం. 

5. ఉన్నత వైద్యవిద్యారంగంలో పరిమాణం, వ్యయం, నాణ్యతను సమన్వయపరచవలసిన అవసరం ఎంతైనా వున్నది. 

వైద్య విద్యలో గానీ, వైద్యసేవలలో గానీ  ప్రవేట్ హవా పెరగడానికి కారణం ఏమిటి?
1950లో దేశ వ్యాప్తంగా వైద్యకళాశాల్లో చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్య 4250. వీరిలో 4175 (98.6 శాతం) మంది ప్రభుత్వ వైద్యకళాశాల్లోను, 60 మంది (1.4 శాతం) ప్రైవేట్ వైద్యకళాశాలల్లో చేరారు. 
1970లో దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల సంఖ్య 12,275 మందికాగా వారిలో 10, 925 (89 శాతం) మంది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో చేరినవారే. మిగతా 11 శాతంమంది ప్రైవేట్ వైద్యకళాలలకు చెందినవారు. 
1990ల అనంతరం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 
2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాల్లో చేరిన వారు 65.7 శాతం కాగా ప్రైవేట్ వైద్యకళాశాలల్లో చేరిన వారు 34.3 శాతం మంది చేరారు. 
2013 సంవత్సరాంతానికి మన దేశంలో మొత్తం ఆ 381 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్య 49,418 మంది కాగా వారిలో 24, 063 (48.7 శాతం) మంది ప్రభుత్వ వైద్యకళాశాలల్లోను, 25, 355 (51.3 శాతం) మంది ప్రైవేట్ వైద్యకళాశాలల్లోను చేరారు. 

మరింత స్పష్టంగా చెప్పాలంటే గత ఆరు దశాడ్దాలుగా భారతీయ వైద్య విద్యారంగంలో ప్రైవేట్ వైద్య కళాశాలల ప్రాబల్యం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యకళాశాలల నుంచి ఏటా వేలాది విద్యార్థులు పట్టభద్రులు అవుతున్నప్పటికీ ప్రజారోగ్య రంగంలో మానవ వనరుల సంఖ్య పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లేదు. కారణమేమిటి? 

ప్రభుత్వాసుపత్రులలో సదుపాయాలు నాసిరకంగా ఉండడం, ఆ వ్యవస్థలో పనిచేసేందుకు అనుకూల, ప్రోత్సాహకర వాతావరణం పూర్తిగా కొరవడడమేనని చెప్పక తప్పదు. ప్రజారోగ్య వ్యవస్థలోని లోపాలు, లొసుగులను సరిదిద్దేందుకు విధాన నిర్ణేతలు సైతం శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వాసుపత్రులలో పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశ లేకపోవడంతో ప్రజలు పూర్తిగా ప్రైవేట్ ఆస్పత్రుల సేవలపై ఆధారపడడం అంతకంతకూ పెరిగిపోతోంది. 

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను సమన్వయపరిచి సత్ఫలితాలను సాధించగలమా? 
ప్రైవేట్ రంగం నుంచి లభ్యమయ్యే వైద్య సేవలను ప్రభుత్వ రంగం కొనుగోలు చేయడం లేదా వాటికి పూచీదారుగా ఉండడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది సమన్వయ వాదుల ప్రతిపాదన (ఆరోగ్యబీమా విషయమై చర్చల్లో ఇదే ప్రధానాంశంగా ఉన్నది).
 పటిష్ఠ ప్రజారోగ్య వ్యవస్థ వాంఛనీయమేగాక అత్యవసరమని కూడా కేరళ రాష్ట్ర అనుభవాలు నిరూపించాయి. 

Comments