Skip to main content

What if Modi comes again ? మాటలమోలీ , మోడీ జీని ని మళ్ళీ భరించాలా?

విద్యావంతులతో సహా  సమస్త భారతీయులు ఉద్వేగ భరితులు. హృదయంతో ఆలోచిస్తారు తప్ప తార్కిక దృక్పధం తో ఆలోచించడానికి ఇష్టపడరు. అంతేకాదు వారి జ్ఞాపకశక్తి కూడా ఉద్వేగపరమైన విషయాలనే గుర్తుపెట్టు కొంటుంది తప్ప,తమ అభివృద్ధికి ఉపయోగపడేవాటిని పెద్దగా గుర్తు పెట్టుకోదు. 
పేరుకి అతిపెద్ద ప్రజాస్వామ్యమే గానీ ,  ఏది మంచి?ఏది చెడు ? ఏది అవసరం?ఏది అనవసరం? అనే విచక్షణా సామర్ధ్యం అత్యంత తక్కువఉన్న దేశం భారతదేశం. ఇలా చెబితే కోపం వస్తుంది గానీ వాస్తవం ఇదే! జనాభా పరంగా ,మూఢనమ్మకాల పరంగా ప్రపంచం లో ముందువరుసలో ఉంటారు. సామాజిక బాధ్యత నిర్వహణ  విషయంలో భారతీయులు  అంతగా ముందుకురారు. దీనికి కారణం పేదరికం,అవకాశాల లేమి,విపరీతమైన పోటీ ! ప్రపంచంలో 
 మనుషులందరూ ఒక్కటే. కానీ ఆయా దేశకాలమాన పరిస్థితులను అనుసరించి వారి ప్రవర్తన ఉంటుంది. కానీ చారిత్రిక వారసత్వం, సంప్రదాయ వారసత్వం ఎక్కువగా ఉన్న నాగరికత గల మనదేశ  ప్రజలు కష్ట నష్టాలలో కూడా వారి బాధ్యతానిర్వహణలో లోపం చేయరు. కానీ సుమారు 1000 ఏళ్లపాటు పరాయి దేశ సైన్యాలు భారతదేశాన్ని అతలా కుతలం చేసేశాయి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన జాతి సాంస్కృతిక ధారను చిన్నాభిన్నము చేసి, మన దేశ ఆత్మను నాశనం చేశారు. దీనితో మనలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బానిస మనస్తత్వం,  ఎవరిని పడితే వారిని అనుకరించడం ,ఆత్మ నూన్యత పెరిగిపోయాయి . అదే ఉత్తరభారతంలో దేశభక్తి,రాజభక్తి , దేనినైనా ప్రశ్నిమ్చే బుద్ధి , దైర్యంగా మాట్లాడటం మనం గమనిస్తాం. నిజానికి దాక్షిణాత్యులు తెలివిగలవారు . 
భారతీయుల మానసిక దృక్పధాన్ని అనుసరించే రాజకీయనాయకుల ప్రవర్తనా సరళి ఉంటుంది. ప్రజలకేమి కావాలో దానినే ఇవ్వడానికి ప్రయత్నిస్తారు తప్ప,ప్రజలకేది అవసరమో దానిని ఇవ్వడానికి వారు ఎందుకు కష్టపడతారు? 
 నిజంగా జరిగిన ఈ కథను పరిశీలించండి. 
 నాకు తెలిసిన ఒక ఎం ఎల్ ఏ జిల్లా  హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో ఉన్నారు. ఆ హాస్పిటల్ కి స్కానింగ్ మిషన్ అవసరమని గత 10ఏళ్ళనుండి వైద్యులు మొత్తుకొంటున్నా ఫలితం లేదు. ఆ ఎం ఎల్ ఏ ఆ కార్యాన్ని తన భుజాలపై  వేసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి ఎలాగైతే స్కానింగ్ మిషన్ ను కేటాయింప చేశారు. ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. మన ఎం ఎల్ ఏ గారు ఇలాంటి మరికొన్ని ప్రజలకు ఉపయోగపడే పనులు కొన్ని చేసి ఉండటం వలన  తన గెలుపు పై గట్టి విశ్వాసం తో ఉన్నారు.  ఇంకో అభ్యర్థి కొత్త. కాపోతే అతని సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ ఉన్నారు.  చివరికి ,అతనే,ఆ కొత్త అభ్యర్ధే  గెలిచాడు. దీనిని బట్టి మనమేమి  అర్ధం చేసుకోవాలి?  కేవలం డబ్బు, కులబలం ఉంటె చాలు, అభివృద్ధి చేయనక్కరలేదు. కాబట్టి ప్రజల దృక్పధాన్ని బట్టే నాయకులు తయారవుతారు తప్ప, నాయకులు పైనుండి ఊడి పడిపోరు.

గత 70 ఏళ్లలో దేశాభివృద్ధికి సిన్సియర్ గా పాటుపడిన ప్రధాను లైన  నెహ్రూ , వాజపేయీ ,నరసింహారావు  చలవ వలన దేశంలో  ఏదో విధంగా తాబేలు నడకలతో నైనా అభివృద్ధి కొనసాగింది.
భాష,సంప్రదాయాలు, నమ్మకాలు,కులమతాలు, ప్రాంతాలు ఇలా ఏదైనా చూడండి,  మనదేశంలో ఉన్న భిన్నత్వం మరెక్కడా చూడము. అలాగే వనరులు తక్కువ,జనాభా ఎక్కువ! ఇన్ని అసమానతలు, భిన్నత్వాలున్న దేశాన్ని ఒకే విధమైన అభివృద్ధి పదం లో నడపటం కత్తిమీద సామే !
గత 25ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాల జమానా చూసిన ప్రజలు మూకుమ్మడిగా మంచి మెజారిటీతో, ఎంతో నమ్మకంతో ఒక నాయకుడిని గెలిపించారు. అతడే మోడీ!
ఒక మంచి అవకాశాన్ని తన స్వయంకృత అపరాధం తో చేజేతులా నీరుకార్చుకొన్న ఒక నాయకుడి కధ చెప్పమంటే  ప్రధాని గా  మోడీ  తీరు చెప్పవచ్చు. 
 వ్యక్తిగతం గా  అవినీతి లేకున్నా,రాజకీయ ఉగ్రవాదాన్ని పెంచిపోషించి,భారతీయత అనే మేలి పరదా మాటున దేశాన్ని మతాలు, ప్రాంతాలు,కులాల వారీగా వేరుచేసి పబ్బం గడుపుకోవడానికిప్రయత్నీమ్చిన ఒకగలీజు మనస్తత్వం ఉన్న నాయకుడు ఎవరో,ఈ కధ చదివితే  మీకే అర్ధం అవుతుంది. 
తన అధికారం కోసం దేశం ఏమైనా ఫర్వాలేదు. రాజ్యాంగ వ్యవస్థలు నాశనమైనా సరే,తన మాటే చెల్లాలి. తానొక్కడే పవిత్రుడు,మిగతా వాళ్ళు అపవిత్రులు" అనే దృక్పధం తో ఉంటాడాయన. 
2014లో అధికారం చేపట్టినాక, అతడు వేసిన వేషాలు, చేసిన  స్లోగన్ లు , చూసి దేశమే కాదు,ప్రపంచమే అతడో మహానాయకుడు అనుకొంది. మీడియా నైతే చెప్పనక్కరలేదు, పుస్తకాలు , స్టిక్కర్ లు తదితర మర్చండైజ్ వేషాలతో అతనో చారిత్రక పురుషుడని  జనాలను ఊదర గొట్టేసింది.
అతి కష్టం మీద 5ఏళ్ళు గడిచాయి. ఒక్క అభివృద్ధి పధకంగానీ, ఒక్క మంచి పాలసీ గానీ కనీసం వారి భావజాలానికి సంబంధించిన , అయోధ్య లో శ్రీరామ్ గుడినిగానీ, అర్టికల్ 70 రద్దు గానీ ,కామన్ సివిల్ కోడ్ గానీ చేయలేని దద్దమ్మ గా మిగిలి పోయాడు. 
2019 వచ్చేసింది. మళ్ళీ  ఎన్నికలొచ్చాయ్. 
ఈ ఏప్రిల్-మే నెలల్లో 40 రోజులకు పైగా సాగే ఎన్నికల ప్రక్రియలో 90 కోట్ల మంది భారతీయులు 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇంత భారీ, సుదీర్ఘ, బహుశా అత్యంత ఖరీదైన ఎన్నికలు ఇంతకు ముందెక్కడా జరిగి ఉండకపోవచ్చు.
"ఏ పార్టీపైనా భారీ అంచనాలు లేని భారీ ఎన్నికలు ఇవి". ఇతడే మన ప్రధానమంత్రి అని చెప్పుకోలేని నాయకులు పోటీ చేస్తున్న ఎన్నికలివి. పార్టీలు సోషల్ మీడియాని కూడా కుళ్ళబెట్టేస్తున్న ఎన్నికలూ ఇవే. మరైతే ఈ ఎన్నికలను కొందరు అంటున్నట్టు “భారతీయ ఆత్మ కోసం జరిగే యుద్ధం” అనుకోవాలా?
ఎక్జిట్ పోల్ చేసిన సంస్థలన్నీ కేంద్రం లో బిజెపి కి మంచిమెజారిటీ వస్తుందని చెబుతున్నాయి. 2014 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని డంకా బజాయిస్తున్నారు.
వాళ్ళు చెప్పిన నంబర్లను నమ్మకపోయినా, గాలి మాత్రం బిజెపి  కి అనుకూలంగానే ఉందని అర్ధం చేసుకోవచ్చు.
ఎన్డీఏ కి( బిజెపి +) 240 లోపు వస్తేమాత్రం మోడీ ప్రధానిగా ఉండకపోవచ్చు. 240 కంటే ఎక్కువ వస్తే మాత్రం మోడీ మళ్ళీ ప్రధానిగా దేశాన్ని ఏలవచ్చు !
మరి, మళ్ళీ మోడీ వస్తే మన భవిష్యత్ ఎలా ఉంటుంది?
మళ్ళీ మోడీని ప్రధానిగా శ్వీకరించడానికి భారతీయులకు ఎంతో దైర్యం ఉండాలి.ఎంతో ఓర్పు కూడా ఉండాలి.  ఎందుకంటే గత 5ఏళ్లలో అతడు చేసిన విధ్వంసాన్ని పరిశీలిస్తే , దేశం ఆటోక్రటిక్ పాలనలోకి దిగజారిపోవడమే కాదు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమై అతడి జేబు సంస్థలుగా కునారిల్లి పోయాయి . అంతేకాదు,రైతులు,సైనికులు,చిన్నమధ్యస్త వ్యాపారులు,యువత సమస్తం నిస్తేజులైపోయారు. ఆర్ధికంగా చితికి పోయారు. గత 40ఏళ్లలో చూడనంత  నిరుద్యోగం పెరిగిపోయింది. దేశ సంపద హరించుకు పోయింది. దేశ ఉత్పత్తి విలువ లో సుమారు 2 లక్షలకోట్లు తగ్గి పోయింది . అనగా దేశం ఆర్ధికంగా 10ఏళ్ళు వెనక్కు జారిపోయింది. ఇలాంటి అభివృద్ధి తిరోగమన చేష్టలు మరెన్నో చేశారు మోడీ! అయినా ఆయనకే ప్రజలు పట్టం కట్టడానికి కారణం ఏమిటి?ఆయన చేసిన ఘనకార్యాలు మరోసారి పరిశీలిద్దాం.

మోదీ ఆడిన కరెన్సీ జూదం (పెద్దనోట్ల రద్దు) ఎంతటి ‘ఘోర వైఫల్యమో’ విశ్లేషకులు ఏడాది గడిచాక తేల్చి చెప్పారు.నల్ల ధనం అనేది కరెన్సీ రూపంలో ఉండదని,అది విదేశీ బాంక్ లలోనే మూలుగు తుందని , మనదేశంలో స్థలాలు,పొలాలు,జాతిరత్నాలు,బంగారం రూపంలోనే ఉంటుందని సాధారణ ఆర్థికవేత్త నడిగినా చెబుతాడు.అయినా సరే, తనబుర్రకుతోచిన తుగ్లక్ ఆలోచనను అమలుచేసి కోట్లాది భారతీయులను ఏడాది పాటు నానా తిప్పలు పెట్టిన మోడీ మళ్ళీ ప్రధానిగా నా?


నగదు ప్రధానంగా నడిచే దేశ ఆర్థిక వ్యవస్థలోని అసంఘటిత రంగాన్నిఇది చావుదెబ్బ తీసింది. చిన్న ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. పేద కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ చర్య ‘రేసింగ్ కారు టైర్ల మీద గురి చూసి కాల్చడంలాంటిది’ అని ఒక ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు.
సాక్షాత్తు మోదీ ఆర్థిక సలహాదారుల్లోనే ఒకరు నోట్ల రద్దును ‘అతి పెద్ద, క్రూరమైన, ద్రవ్యాఘాతం’ అని పేర్కొన్నారు. 2016 చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు కనీసం 2 శాతం తగ్గిందని 'నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్' అనే అమెరికన్ సంస్థ వెల్లడించింది.
రద్దయిన నోట్లలో 99 శాతం వెనక్కి వచ్చాయని స్వయంగా రిజర్వ్ బ్యాంకే ప్రకటించింది. దాని అర్థమేంటి? మోదీ ఊహించినంతగా దేశంలో నల్ల ధనం లేకుండా అయినా ఉండాలి. లేదా నల్ల ధనవంతులకు తమ డబ్బును తెల్ల ధనంగా మార్చుకునే మార్గాలు పుష్కలంగా ఉండైనా ఉండాలి. రద్దయిన నోట్లలో నకిలీ నోట్ల శాతం చాలా తక్కువని కూడా తేలింది.
మొత్తంగా ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తీసుకొన్న చర్యా ఇది? లేక తన పార్టీకి దొడ్డి దారిలో కుప్పలకొద్దీ డబ్బు ని ధారాదత్తం చేసే చర్యా?
 మోదీ తీసుకున్న చర్య ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వకపోగా చాలామంది అనేక ఇక్కట్ల పాలయ్యారు.
(ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం భారత జీడీపీలో ‘షాడో ఎకానమీ’ ఐదో వంతు ఉంటుంది.)
ఏటీఎం  క్యూల్లో  సన్నకారు పేదలు ,మధ్యతరగతి వాళ్ళు  మాత్రమే ఉన్నారు. సంపన్నులు, పలుకుబడి గల వాళ్ళ దగ్గర కదా కట్టలు కట్టలు డబ్బు ఉంటుందని అనుకునేది. మరి వారెవ్వరూ ఇక్కట్లు పడలేదు. 
“ఎన్నో విభజనలు, అసమానతలు ఉన్న సమాజంలో తమతోపాటు ధనవంతులకు కూడా ఇబ్బంది కలుగుతోంది అంటే ఆ ఇబ్బందులను కష్టమైనా భరించడానికి పేదలు సిద్ధంగా ఉంటారు. అయితే ధనవంతులు ఇబ్బంది పడతారనేది అబద్ధమని పేదలకు అర్ధం కావడానికి చాలా సమయం పట్టింది.”
మరో విధంగా చెప్పాలంటే మామూలు జనానికి అది schadenfreude లా పనిచేసింది. అంటే ఇతరుల బాధ చూసి ఆనందించే చర్యగా ఉపయోగపడింది.
కాని మధ్యతరగతి వర్గాలు  మాత్రం ఇప్పటికీ ప్రధాన మంత్రిని క్షమించలేకపోతున్నారు.

“నా డబ్బును నేను తీసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడాల్సి రావడం నాకే నమ్మశక్యంగా లేదు” అని అన్నారు ఒకాయన. 
“మోదీని నమ్మడం వల్లే మాకు ఇదంతా జరిగింది. అవినీతిపరులైన ధనవంతులకు గుణపాఠం నేర్పడానికే ఈ చర్య తీసుకున్నట్టు ఆయన చెప్పిన దాన్ని మేం నమ్మాం. వారిని శిక్షించడం కోసం మా బోటివాళ్ళం కొంత త్యాగం చేయక తప్పదని నమ్మాం.కానీ ఆ తర్వాత నేను మోదీని నమ్మడం మానేశాను. ఆయన వరస పెట్టి అబద్ధాలే చెబుతున్నారు. అది ఒక ప్రధాన మంత్రికి తగని పని” అని మరొకరు ఆవేశంగా మాట్లాడారు. 
హిందుత్వ పేరిట అరాచకాలు: 
ఉత్తర , పశ్చిమ భారతంలో కొన్ని చోట్ల  గో రక్షక గుంపులు తమకు తామే అధికారాలు దఖలు పరుచుకుని అరాచకంగా ప్రవర్తించడం పెరిగింది. హైవేల మీద చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి, వచ్చే పోయే వాహనాల్లో ఆవులు ఉన్నాయో లేదో తనిఖీ చేయడం, డైరీ రైతులతో, పశువుల వ్యాపారులతో దురుసుగా ప్రవర్తించడం (వీరిలో ముస్లింలే అధికంగా ఉంటారు) వంటి చర్యలకు పాల్పడ్డారు. గో సంరక్షణ అనేది వారికి డబ్బులు వసూలు చేసుకునే ఒక మార్గం అయిపోయింది. 
నిరుద్యోగం :
లీకైన ఒక ప్రభుత్వ నివేదిక ప్రకారమే నిరుద్యోగం రేటు 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో ఉంది. 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' అనే స్వతంత్ర మేధావుల సంస్థ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 3 కోట్ల మందికి పైగా ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.
దశాబ్దాల తరబడి వృద్ధి రేటు బాగున్నా ఉద్యోగ కల్పన మాత్రం చాలా తక్కువగానే ఉంది.

ఇండియాలో టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్స్ పరిశ్రమలు చాలా వేగంగా పెరుగుతున్నప్పటికీ అరకొర చదువులు చదివి, తక్కువ సామర్థ్యం గల పనులు మాత్రమే చేయగల లక్షలాది నిరుగ్యోగ యువతకు అవి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి. దానికి తోడు మోదీ పాలనలో ప్రైవేటు పెట్టుబడి మందగించి, ఆర్థికాభివృద్ధి నిలకడగా లేకపోవడంతో ఉద్యోగ కల్పన ఇంకా తగ్గిపోయింది.

ప్రస్తుతం దేశ శ్రమశక్తిలో 80 శాతం పైగా తక్కువ జీతాలు లభించే, తక్కువ ప్రయోజనాలు ఉండే ‘అసంఘటిత’ రంగంలో పని చేస్తోంది. పది శాతాని కన్నా తక్కువ మంది మాత్రమే అన్ని ప్రయోజనాలు ఉండే ‘ఫార్మల్ ఎకానమీ’లో పని చేస్తున్నారు.
ఉద్యోగం సాధించడం ఇక్కడ ఒక అంతు లేని పోరాటంలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

తన తెలివి తక్కువతనాన్ని మాయదారి మాటలతో మసిపూసి దానినో మారేడుకాయ లా భ్రమింపచేసే మాటలమోలీ ని మళ్ళీ భరించాలా?

Comments