Skip to main content

మీ పిల్లలను MBBS చదివిస్తారా?

ఒక్క నిముషం ఆగండి . ఇది చదవండి.
మన ఆంధ్రరాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 1900 MBBS సీట్లున్నాయి. 19 ప్రవేట్ మెడికల్ కాలేజీల్లో 2400  MBBS సీట్లున్నాయ్. 
ప్రభుత్వ మెడికల్ కాలేజీలలోని సీట్లలో 15% అఖిలభారత కోటా లో ఉంటాయి.  
ప్రవేట్ మెడికల్ కాలేజీల్లో ని సీట్లలో 50% మేనేజ్ మెంట్ కోటా లో ఉంటాయి. 
ఇంటర్ పాస్ తర్వాత, నీట్ పరీక్షలో రాంక్ సంపాదించాలి. ప్రవేట్ మానేజ్ మెంట్ సీట్లు కూడా నీట్ పరీక్ష ఆధారంగానే మెడికల్ యూనివర్సిటీలు కౌన్సిలింగ్ చేస్తాయి. ఇదీ మనరాష్ట్రంలో మెడికల్ విద్యతీరుతెన్నులు . 
నీట్  రాంక్ సాధించారు. కష్టపడి చదివి MBBS డిగ్రీ కూడా సాధించేశారు? ఓకే! నెక్స్ట్ ఏమిటి?? చూద్దాం రండి.... 

50000  మోడ్రన్ డాక్టర్స్ ,  ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిఏటా 4000 కొత్త MBBS డాక్టర్స ,మరో 2000 ఆయుష్ వైద్యులు  చేరుతున్నారు. మన రాష్ట్ర జనాభా 5కోట్లు. WHO ప్రకారం ప్రతి 1000మంది జనాభాకి కనీసం ఒక డాక్టరైనా ఉంటె మంచిది. ఇప్పటికే ఈ నిష్పత్తి ప్రకారము  మన రాష్ట్రంలో మోడ్రన్  వైద్యులు(MBBS) ఉన్నారు. వీరికి తోడు ఆయుష్ వైద్యులు మరో 50000 మంది ఉన్నారు. ఓ లక్షమంది వ్యక్తులుRMP &PMP CERTIFICATES తో  నకిలీ  వైద్యం చేస్తూ సమాజాన్ని  మోసం చేస్తూనే ఉన్నారు. మరో అర లక్షమంది మందుల దుకాణదారులు ఎలాంటి వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా వారికీ తోచిన మందులు ఇచ్చేస్తూ వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వం MBBS డాక్టరుకి 55000 జీతం ఇస్తుంటే,కార్పొరేట్ హాస్పిటల్స్ లో కేవలం 35000/ ఇస్తున్నారు. ప్రవేట్ గా క్లినిక్ పెడదామంటే,చిన్న చిన్న క్లినిక్స్ కు,హాస్పిటల్స్ కు  ప్రయివేట్ ఆరోగ్య భీమా ఎంపానెల్ మెంట్ గానీ , NTRవైద్యసేవ ట్రస్ట్ ఎంపానెల్ మెంట్ గానీ వచ్చే అవకాశం లేదు. అవి లేకుంటే ప్రాక్టీస్ ఉండదు. వచ్చే ఆదాయం క్లినిక్ ఖర్చులకు కూడా సరిపోదు. ప్రభుత్వ ఉద్యోగాలకోసం అప్లై చేద్దామంటే ఛాన్స్ లేదు. ఆంధ్రాలో ఈ మధ్యన 1000 డాక్టర్స్ పోస్టులకు ప్రకటనలిస్తే 6000 MBBS డాక్టర్స్ పోటీ పడ్డారు. MBBS తర్వాత  PG చేద్దామంటే ఉన్న 35000 PG సీట్లకోసం 140000 మంది MBBS వైద్యులు నీట్ పరీక్ష లో  పోటీ పడుతున్నారు.అనగా,సుమారు లక్షమంది డాక్టర్స్  MBBS డిగ్రీతోనే బతకాలి.ఇది కఠోర వాస్తవం. 6 ఏళ్ళు కష్టపడి MBBS  చదివితే చేతికొచ్చేది సరాసరి 45000/.  అదీ రేయనక,పగలనక, పండుగా పబ్బం లేకుండా పనిచేస్తే నే దక్కుతుంది. ఏదన్నా తేడా పాడా వస్తే వీపు విమానం లెక్క మోత మోగిపోతుంది. ఎవడన్నా సరదాకో , ఆకతాయిగానో వినియోగదారుల రక్షణ కోర్టు కీడిస్తే నిలువుదోపిడీ తో పాటుగా దివాళా పిటిషన్ వేసుకోవలసిందే!
సాధారణ డిగ్రీ చేసి టీచర్, సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఇంతకు రెట్టింపు ఎలాంటి టెన్షన్ లేకుండా సంపాదిస్తున్నారు.  పై పెచ్చు ఈ మధ్య ప్రభుత్వాలు,నైపుణ్యాభివృద్ధి పేరిట ఆయుష్ వైద్యులకు,నర్సింగ్ సిబ్బందికి ఓ 6 నెలలు తర్ఫీదిచ్చి వారిచేత మోడ్రన్  వైద్యం చేయించడానికి నడుం బిగించి చట్టాలు చేస్తున్నాయి.అంటే నోట్లో నాలుకా ,చేతిలో పెన్ను ఉన్న ప్రతోడూ వైద్యం చేసే మాయదారి గడ్డుకాలం దాపురించిన  ఇలాంటి పరిస్థితుల్లో  MBBS చదవడం మంచిదేనా?
ఇప్పటికే ఇంజనీరింగ్ విద్యను నాశనం చేసేశారు . మోడ్రన్ వైద్యవృత్తిని నిర్వీర్యం చేస్తే ఆటోమేటిగ్గా మోడ్రన్ వైద్య విద్య కూడా భ్రష్ట్టు పట్టి పోతుంది. చిన్న చిన్న హాస్పిటల్స్ బతికిబట్ట కట్టే పరిస్థితి లేదు. కేవలం 50 బెడ్స్ ,ఆ పై ఉన్న హాస్పిటల్స్ మాత్రమే ఫీల్డ్ లో ఉంటాయి. క్లినిక్స్, చిన్న హాస్పిటల్స్ మూతపడతాయి. మరికొంత కాలానికి భీమా కంపెనీలు ఏమిచెబితే అదే చేయగల హాస్పిటల్స్ మాత్రమే ఉంటాయి. భీమా కంపెనీలు ఏమి చెబితే అదే వైద్యం చేయాలి. లేకుంటే హాస్పిటల్ మూసివేసుకోవలసిందే !అమెరికాలో అదే జరుగుతుంది. భవిష్యత్ లో భీమా కంపెనీలే హాస్పిటల్స్ పెట్టేస్తాయి. 
మరి ,ఈ సమస్యలకు పరిష్కారం లేదా?
1.  ఆరోగ్యబీమా పధకాల కింద కాష్ లెస్ గా  ప్రాధమిక, సెకండరీ వైద్య సర్వీసులు అందివ్వడానికి, అన్ని రకాల క్లినిక్స్, డేకేర్ హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ కి  అవకాశం ఇవ్వాలి.  నాణ్యత ప్రమాణ లలో కార్పొరేట్ హాస్పిటల్స్ ను, చిన్న హాస్పిటల్స్ ను ఒకే విధంగా చూడకూడదు.
2.  రూరల్ ఏరియాలలో వైద్య సేవలందించే హాస్పిటల్స్ నుండి వసూల్ చేసే  కరెంట్ , నీరు, కాలుష్య రక్షణ, వృత్తి పన్ను ,ఆదాయపన్ను , GST తదితర పన్నులు,చార్జీల లో  రాయితీ లివ్వాలి. అలాగే రూరల్ ఏరియాల్లో సర్వీసు చేసే MBBS  వైద్యులకు కనీసం లక్ష రూపాయలు, స్పెషలిస్ట్ లకు 2లక్షలు  జీతం ఇవ్వాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పర్మనెంట్ పద్ధతిలో ఉద్యోగాలివ్వాలి. 
3. PG వైద్యసీట్లను పెంచాలి. MBBSసీట్లు, PG సీట్లు 1: 1 నిష్పత్తిలో ఉండాలి. 
4. DNB పరీక్షలలో ఉత్తీర్ణత శాతాన్ని ఇప్పటి 25% నుండి 50% కి పెంచాలి. లేదా DNB  ట్రైనింగ్ పూర్తయిన వారికీ వైద్య  యూనివర్సిటీ పరీక్ష లలో పాల్గొనే అవకాశం ఇవ్వాలి. 
5. PGడిప్లొమా చేసిన వారిని స్పెషలిస్ట్ లుగానే పరిగణించి,వైద్య కళాశాలల్లో టీచింగ్ ఫాకల్టీ గా పనిచేయడానికి  అనుమతివ్వాలి. 
6. వినియోగదారుల రక్షణ చట్టం నుండి వైద్యసేవలను తప్పించాలి. ఈ సేవలను మెడికల్ ట్రిబ్యునల్ పరిధిలోకి తేవాలి. 
7.  వైద్య డిగ్రీ లేకుండా మోడ్రన్ వైద్యం చేయడాన్ని , ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి. దానికి తగిన చట్టాన్ని తెచ్చి కఠినంగా అమలుచేయాలి. 
8. వైద్యులపై జరిగే దాడులను నిరోధించే కేంద్ర చట్టము, అలాగే రాబోయే ఈ కేంద్ర చట్టానికి, కొన్ని  రాష్ట్రాలలో ఇప్పటికే  చేసిన ఇలాంటి చట్టాలకు అనుగుణంగా ఇండియన్ పీనల్ కోడ్ లో తగు క్లాజులు,సెక్షన్ లు చొప్పించి పోలీస్ వారు వీటిని అమలు చేసే ప్రక్రియకు నాంది  పలకాలి. 
9.  మోడ్రన్ వైద్యాన్ని దొంగ దెబ్బతీసే చర్యలు విరమించుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ పట్ల పక్షపాతం తగ్గించుకోవాలి.  
10. సాధారణ నర్సులకు, ఆయుష్ వారికీ తర్ఫీదులిచ్చి మోడ్రన్ వైద్యం చేయించే నిర్ణయాలను విరమించుకోవాలి. 
 భారతదేశ పౌరులారా! మీ పిల్లలను MBBS చదివించాలంటే ముందుగా ప్రభుత్వాలు  పైన చెప్పిన పరిష్కారమార్గాలు అమలుపరచాలి. ఆలా అమలు చేసేటట్లు ప్రభుత్వాల పై ఒత్తిడి తెచ్చే బాధ్యత మీదే! అపుడే మీ పిల్లలను MBBS చదివించి, మంచి  వైద్యులుగా  తీర్చిదిద్దండి! 

Comments