Skip to main content

ఆయుష్ మాన్ భారత్ పధకం మోదీగారి మరో జుమ్లా అవుతుందా ?

50కోట్లమంది పేదలకోసం కేంద్రప్రభుత్వం ఆర్భాటం గా ప్రవేశ పెట్టిన ఆరోగ్య భీమా పధకం విజయవంతం అవ్వాలంటే ఏమిచేయాలి ?
By- Dr.C.Srinivasa Raju- Chairman-HBI-IMA AP.
---------------------------------------------------------
కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు, ప్రభుత్వ హాస్పిటల్స్ , ప్రవేటు హాస్పిటల్స్ , వైద్యులు, ఆరోగ్యపరిశ్రమలో ఇతర  భాగస్వామ్యులైన నర్సింగ్ సిబ్బంది, మెడికల్ పరికరాలు  మరియు ఫార్మసీ పరిశ్రమలు, మెడికల్ కాలేజీలు, అలాగే ఆరోగ్యబీమా కంపెనీలు ,అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఒక్కటిగా సమన్వయము తో అవినీతి,అలసత్వానికి చోటు లేకుండా  నిజాయితీగా  కష్టపడాలి. 

ఏదైనా ప్రాజెక్ట్ విజయవంతంగా అమలుచేయాలంటే ఆర్ధిక  పెట్టుబళ్లు అత్యంత అవసరం. అవి ఉంటేనే, నైపుణ్యం గల మానవ వనరులు  ,  అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోగలం. 130కోట్ల జనాభా ఉన్న మనదేశం స్థూల జాతీయ ఉత్పత్తి విలువ కేవలం 120 లక్షల కోట్లు . దీనిని తలసరిగా పంచుకొంటే  సాలుసరి గా దక్కేది కేవలం 150000 మాత్రమే ! 
కానీ సమానంగా పంచుకోవడమనేది ఎపుడూ జరగనే జరగదు. 70%సంపద కేవలం 1% వ్యక్తుల గుప్పెట్లో ఉందని అందరికీ తెలిసిన విషయమే! దేశంలో ఆర్ధిక అసమానతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అంతకంటే తీవ్రంగా అవకాశాల లో ,ఆరోగ్యసేవలలో , విద్యాభివృద్ధిలో ఉన్నాయి.
మనజనాభాలో  70% చిన్న చిన్న పట్టణాలు,గ్రామీణ ప్రాంతాలలో ఉంటే, వారికి   వై ద్యసేవలు అందించే వైద్యులు , వైద్య సదుపాయాలు, సౌకర్యాలు కేవలం 30%మాత్రమే ఉన్నాయి. అదే, మొత్తం జనాభాలో   30% ఉన్న  పెద్ద పెద్ద పట్టణాలు మెట్రో నగరాల లో  70% వైద్య సదుపాయాలు, వైద్యులు, హాస్పిటల్  మంచాలు , అధునాతన వైద్య సౌకర్యాలు   అందుబాటులో ఉన్నాయి. 


600 జిల్లాలు న్న మన దేశంలో 150000 సబ్ సెంటర్స్ , 25000 PHC  లు , 6000 CHC లు , 600 జిల్లా హాస్పిటల్స్, 10 ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ లు, 25 ప్రాంతీయ కేన్సర్ హాస్పిటల్స్, 
18 ప్రాంతీయ కళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి . 
 7లక్షల హాస్పిటల్ మంచాలు, 9 లక్షల మోడ్రన్ వైద్యులు, మరో 8 లక్షల ఆయుష్ వైద్యులు , 10 లక్షల నర్సింగ్ సిబ్బంది  పనిచేస్తున్నారు. 
మొత్తం  సాలుసరి 5లక్షలకోట్ల ఆరోగ్యపరిశ్రమ రంగంలో హాస్పిటల్ సేవల వాటా కేవలం లక్షకోట్లు. ఈ లక్ష కోట్ల లో కేవలం 25000 కోట్లు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుపెడుతుంటే,  సామాన్య ప్రజలు ప్రతిఏటా   తమజేబునుండే 75 000 కోట్లు ఖర్చు పెట్ట వలసి రావడం చేత, ఏటా 5కోట్లమంది దారిద్రం లోకి కునారిల్లి పోతున్నారు. 

ఏ దేశాన్ని చూసినా , ముఖ్యంగా మనలాంటి  పేదదేశాలైన థాయ్ లాండ్,ఫిలిప్పీన్స్, ఇండోనేషియా,శ్రీలంక లాంటి దేశాలనుగానీ, బ్రిక్ దేశాల లోని ఆరోగ్యవ్యవస్థలను పరిశీలించినా ఒక్కటే అర్ధం అవుతుంది. ఆరోగ్యసేవల ఖర్చులో ప్రభుత్వ వాటా కనీసం 50% ఉన్నపుడే సామాన్యులకు సరైన సమయంలో నాణ్యమైన వైద్యం అందుతుంది   ఉండాలి. అంతేకాదు, ప్రాధమిక,అత్యవసర చికిత్స వ్యవస్థలలో మౌలిక సదుపాయాలు ,అత్యవసర మందుల సరఫరా, వ్యాధినిర్ధారణలో సాయపడే డయాగ్నోస్టిక్ పరికరాలు , నర్సింగ్ సిబ్బంది,వైద్యుల వ్యవస్థ  పటిష్టంగా ఉండాలి . 

ప్రవేట్ హాస్పిటల్ సేవలను, వైద్యుల సర్వీసులను  సరిగ్గా వినియోగించుకోకుంటే ఆయుష్ మాన్ పధకం సజావుగా సాగదు . 
·        హాస్పిటల్స్ సర్వీసు  పై న 0% GST ఉంచి , ఇన్ ఫుట్ క్రెడిట్ లాభం ఉండేటట్లు GST  చట్టాన్ని మార్చాలి.  
·        నాణ్యతా తనిఖీల పేరిట,మెడికల్ ఆడిట్ పేరిట హాస్పిటల్స్ పై ఇన్స్పెక్టర్ రాజ్ చర్యలను మానుకోవాలి. 
·        క్వాలిటీ పెరుగుదలకోసం, ఎంపానెల్ మెంట్ కోసం   "నిర్బంధ అక్రిడేషన్"  బదులుగా  "స్వచ్చంద అక్రిడేషన్ " పాలసీ ఉండాలి. 

  • 10  బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ ని ఎంపానెల్ మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడం మంచిదే! కానీ,రూరల్ ప్రాంతాలలో క్లినిక్స్ ని కూడా ఎంపానెల్ మెంట్  చేస్తే బాగుంటుంది. 
  • ముఖ్యంగా అతిపెద్ద భాగస్వామి ఐన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను అన్ని అధికార పానెల్స్ లో సభ్యులుగా తీసుకొని,ఏ పాలసీ నిర్ణయమైనా వారి అనుమతి తోనే చేయాలి. 
క్వాలిటీ సేవలు (NABH ACCREDITED HOSPITALS)  అందించే హాస్పిటల్స్ కి ఎక్కువ ప్యాకేజీ  ఫీజు చెల్లించే విధానం ద్వారా ప్రవేట్ హాస్పిటల్స్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడటమే కాక, వాలంటరీగా నాణ్యతలను మెరుగు పరచుకొనే అవకాశం ఏర్పడుతుంది. 
ఆరోగ్య చికిత్సలకు  ప్రభుత్వం ప్రకటించిన పాకేజీ లు చాలా తక్కువ. కేవలం కొన్ని చికిత్సలు అనగా ప్రాధమిక చికిత్సలయిన జ్వరం,విరోచనాలు , దగ్గు-జలుబు లాంటి వాటికి ఒకటి లేదా రెండు విజిట్స్ లోనే వైద్యం పూర్తయినా సెకండరీ కేర్ చికిత్సలకు దీర్ఘకాలం అందించవలసి రావచ్చు. కాబట్టి సర్జరీలకు , కౌన్సిలింగ్ మరియు పున రావాసం పేరిట  మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది.    దీర్ఘకాల ప్రక్రియ తో కూడిన చికిత్స లకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు సరిపోవు. . 

ముఖ్యంగా టైర్ 3 & టైర్ 4 పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్లినిక్ , హాస్పిటల్స్ అన్నింటినీ సెకండరీ కేర్ హాస్పిటల్స్ గా ఎంపానెల్ చేసుకొంటే, అత్యధిక శాతం జనాభాకు  నాణ్యమైన నగదురహిత,పేపర్ రహిత వైద్యం సకాలంలో అందుతుంది . అలాగే జాప్యం లేకుండా రీ ఎంబర్స్ మెంట్  చేయాలి. 

ప్రవేట్ హాస్పిటల్స్ ని వివిధరకాల చట్టాలతో కట్టడి చేయాలనుకోవడం సరైన మానేజ్ మెంట్ అనిపించుకోదు. మనలాంటి దేశాలలో ఎన్ని చట్టాలుంటే అంతెక్కువ అవినీతి జరుగుతుంది తప్ప, మనం సాధించాలనుకొంటున్న క్వాలిటీ సాధ్యం కాదు. 
ఇంకో ముఖ్య విషయం- ఆరోగ్యసేవల ఖర్చులో 40 శాతం,  మందులు, మెడికల్ డిస్పోసబుల్ పరికరాల కే ఖర్చు అవుతుంది. కాబట్టి "ఒక మాలిక్యూల్ - ఒకే ధర-ఒకేదేశం " అనే విధంగా మందుల మార్కెట్ ను నియంత్రణ చేసి అత్యవసర మందుల లిస్ట్ ని (NLEM) తయారు చేసి అవి నిరంతరం అందుబాటులో ఉండే చర్యలు ప్రభుత్వం తీసుకోకుంటే మొత్తం పధకం ఫెయిల్ అవుతుంది. 
DPCO ,NPPA ని మరింత పటిష్టం చేయాలి. అంతేకాదు,  మనదేశం 70 శాతం మెడికల్ డిస్పోసబుల్ పరికరాలను దిగుమతి చేసుకొంటుంది. వీటిపై 50 శాతం కస్టమ్స్ సుంకం, 18 నుండి 28 శాతం GST వేయడం చేత సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. 

వైద్యులకు,పేరా మెడికల్ & నర్సింగ్ సిబ్బందికి నైపుణ్య శిక్షణ అనేది ఒక నిరంతర ప్రక్రియ గా ప్రభుత్వం చేపట్టి,ఆ దిశగా ప్రతి జిల్లా హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీలలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్థాపించి ,టెక్నాలజీ ద్వారా  సిమ్యు లేషన్ ,మానికిన్ లను  ఉపయోగించి ఉచిత  తర్ఫీదు నివ్వాలి. 
ప్రవేట్ వైద్యుల సేవలను  అడహాక్ పద్ధతిలో  PHC / CHC / జిల్లా హాస్పిటల్స్ లో ఉపయోగించు కోవాలి. 
ఇవన్నీ సాధ్యపడాలంటే ముందుగా చెప్పుకున్నట్లు, ఆరోగ్యరంగ బడ్జెట్ కి GDP   లో  3%  కేటాయించాలి.  అనగా సుమారు 3 లక్షల కోట్లు కేటాయించాలి. అంతేగానీ  ప్రస్తుతం కేటాయించినట్లు ఆయుష్ మాన్  పధకానికి 12000 కోట్లు మరియు ఇతర పథకాలకు,మెడికల్  విద్యాభివృద్ధికి కలిపి మరో  35000 కోట్లతో  ఆరోగ్యరంగాన్ని  నడపాలనుకోవడం కేవలం అమాయక ప్రజలను మభ్యపెట్టే  జిమ్మిక్ గా మిగిలిపోతుంది. 
రాబోయే 7 ఏళ్లలో (2025) 8000 PG  సీట్లు,16000  MBBS సీట్లు , 50  జిల్లాహాస్పిటల్స్ లో మెడికల్ కాలేజీల స్థాపన, మరో 22 అల్ ఇండియా మెడికల్ సంస్థలు, కేన్సర్ సెంటర్స్ ,ట్రామా సెంటర్స్ స్థాపించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం మంచిదే! కానీ బడ్జెట్ కేటాయింపులు గానీ, విదేశీ పెట్టుబళ్ల ను ప్రోత్సహించే పధకాలు గానీ లేకుండా ఇవన్నీ సాధ్యపడతాయంటే చిన్నపిల్లలు కూడా నమ్మలేరు. 

ప్రతి జిల్లాలో ,ప్రతి మెడికల్ కాలేజీలో మందుల నాణ్యతా పరీక్షలు చేయగలిగే లాబ్ లు , ఆహార కల్తీని కనిపెట్టే సాంకేతిక  సౌకర్యాలను  స్థాపించాలి. నకిలీ మందుల వలన , నకిలీ వైద్యుల వలన మనదేశ ఆరోగ్యరంగానికి, ఆర్ధిక వ్యవస్థకు ఎంత నష్టం వాటిల్లుతుందో తెలిస్తే కడుపు తరుక్కు పోతుంది. జాతీయ ఉత్పత్తి తగ్గుతుంది.  లక్షలాది మానవ పనిదినాలు నష్టపోతున్నాం 

అలాగే రోగనివారణ కోసం వాక్సినేషన్ , వెక్టార్ ల నియంత్రణ తోపాటు , ధూమపానం,ఆల్కహాల్ సేవనం ,గుట్కా అలవాట్ల నుండి ప్రజలను విముఖులను చేయాలి. అంతేకాదు ఆహరం, పాలు,నీళ్లు, గాలి లో కల్తీలు,కాలుష్యాల వలన ఎంతగా ఆరోగ్యభంగం జరుగు తుందో అందరికీ తెలుసు. అలాగే పళ్ళు, కాయగూరల పెంపకంలో పురుగు మందులు విపరీతమైన వాడకం చేత ఎంత విషాన్ని మనం మింగుతున్నామో అందరికీ తెలిసిన విషయమే!  డైరీ, పౌల్ట్రీ పరిశ్రమల్లో హార్మోన్ ల వాడకం వలన, జన్యు పరివర్తన వంగడాల వలన ఎంతగా నష్టం వాటిల్లుతుందో ప్రభుత్వానికి తెలుసు. 
వీటన్నింటి కంటే అతిముఖ్యమైనది- జనాభా నియంత్రణ! మన దేశానికున్న వనరులు కేవలం 50 కోట్ల జనాభాని మాత్రమే భరించ గలవు . అంతకంటే ఎక్కువ ఉంటే సహజ వనరుల నాశనం , మానవజాతి వినాశనానికి దారితీస్తుంది. పారబోసుకొని ఎత్తు కొన్న చందంగా ఉంది మన జీవితం . ప్రభుత్వాలు,ప్రజలు ఇప్పటికైనా కళ్లుతెరిచి బాధ్యతగా ప్రవర్తించక పోతే ఎన్ని పధకాలు ఎంతబాగా అమలు చేసినా ప్రయోజనం తాత్కాలికం . 

Comments