Skip to main content

సిజేరియన్ వల్ల లాభపడుతున్నది ఎవరు?’??

ఎందుకు సిజేరియన్ ఆపరేషన్ ల గురించి సమాజం(ప్రభుత్వం,మీడియా) భయపడుతుంది?
దీనికి కొన్ని కారణాలున్నాయి. 
  •  నార్మల్ డెలివరీ తో పోల్చుకొంటే, సిజేరియన్ తరవాత రికవరీకి ఎక్కువ టైమ్ పడుతుంది . 
  • సిజేరియన్ వల్ల ఒక్కోసారి చాలా రక్తం పోతుంది. అలాంటప్పుడు నీరసపడిపోవడం, పాలు తయారవ్వకపోవడం, డిప్రెషన్‌కు లోనవ్వడం లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విపరీతంగా ఒళ్ళు రావడంతో పాటు డయాబెటిస్ బారినపడే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.
  • ఎక్కువ మంది డాక్టర్స్, హాస్పిటల్ మంచాలు,  నర్సింగ్ సేవలు అవసరం ఉండటం చేత దేశ ఆర్ధిక వ్యవస్థపై భారం పెరుగు తుంది . 
డాక్టర్స్ పై అపోహలు పెరగడానికి కారణమేమిటి?
" పని తేలికవుతుందనీ , డబ్బుకోసం సిజేరియన్లు చేస్తున్నారనీ డాక్టర్ల మీద చాలా సులువుగా ఆరోపణలు మోపుతారు.. కానీ అది నిజం కాదు. చాలామంది మహిళలు వజైనల్ డెలివరీలో వచ్చే నొప్పిని తట్టుకోవడానికి సిద్ధపడరు. వాళ్ళే సిజేరియన్ చేయమని మమ్మల్ని అడుగుతుంటారు".  
చాలామంది డెలివరీకి ముహూర్తాలు చూసుకుని వస్తారు. వాళ్ళకు నచ్చిన తేదీ, ఘడియల్లోనే డెలివరీ కావాలని కోరుకుంటారు. అలాంటప్పుడు కూడా సి-సెక్షన్ తప్ప మరో మార్గం లేదు. 
కొందరు తల్లుల వయసు ఎక్కువగా ఉండటం, ప్రసవానికి ముందు వ్యాయామం చేయకపోవడం లాంటి కారణాలు కూడా సిజేరియన్‌కు దారితీస్తున్నాయి .
"మారుతున్న జీవనశైలి ఈ పరిణామానికి ఓ ప్రధాన కారణం. ఈరోజుల్లో అమ్మాయిలు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారు. సరైన వ్యాయామాలు కూడా చెయ్యట్లేదు. ఇలాంటప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడం కష్టమే!" . 
తల్లి.. బిడ్డను పుష్ చేయలేకపోయినా, లేదా తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అనిపించినా సిజేరియన్ చేయకతప్పదు.
డాక్టర్స్ కి బాధ్యత లేదా?
గతంలో సిజేరియన్‌కు సంబంధించిన నిర్ణయం డాకర్లు మాత్రమే తీసుకునేవారు. ఎవరైనా మహిళ సిజేరియన్ కావాలని అడిగినా, డాక్టర్లు ఒప్పుకునేవారు కాదు. కానీ 2011లో ఈ నియమాన్ని సడలించారు. ఎవరైనా సిజేరియన్ చేయమని అడిగితే డాక్టర్ ఒప్పుకోవాలి. కానీ, సిజేరియన్ కోరిన మహిళలకు దాంట్లో ఉన్న కష్టనష్టాలు పూర్తిగా వివరించాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంది.
ప్రసవానికి ముందు స్త్రీలకు అనేక రకాల భయాలుంటాయి. దీన్ని "టోకోఫోబియా (Tocophobia)" అంటారు. ఆ భయం వల్ల సిజేరియన్ చేయమని అడగొచ్చు. అలాంటి భయాలు పోగొట్టి పేషెంట్‌ని నార్మల్ డెలివరీకి ఒప్పించడం డాక్టర్ బాధ్యత. 
సిజేరియన్ డెలివరీలు ఎందుకు పెరుగుతున్నాయి?
నిజానికి మహిళల ఆరోగ్యానికి సిజేరియన్లు అంత మంచివికాకపోయినా, భారత్‌తో సహా అనేక దేశాల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది.
అందుకే, మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైల్డ్ బర్త్ గైడ్‌లైన్స్‌లో కొన్ని మార్పులు సూచించింది. దీనిని "ఇంట్రాపార్టమ్ కేర్ ఫర్ ఎ పాజిటివ్ చైల్డ్‌బర్త్ ఎక్స్‌పీరియన్స్" (Intrapartum Care for a Positive Childbirth Experience) అని పిలుస్తారు.
‘‘నార్మల్ డెలివరీకి ఎక్కువ టైమ్ పడుతుంది. సిజేరియన్ త్వరగా అయిపోతుంది. అందుకే WHO గైడ్‌లైన్స్‌లో 'మహిళల ప్రసవానికి ఎక్కువ సమయం కేటాయించాలి' అని చేర్చారు’’ . 
అన్ని ప్రసవాలకూ "వన్ సెంటిమీటర్ రూల్" వర్తించదు అని కూడా ఈ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఈ వన్ సెంటిమీటర్ రూల్ ఏంటి?
ప్రసవ సమయంలో ప్రతి గంటకు బిడ్డ ఒక సెంటీమీటర్ కిందకు జరుగుతుంటుంది. దీన్ని మెడికల్ భాషలో "వన్ సెంటిమీటర్ రూల్" అంటారు . 
మన భారతదేశంలో సిజేరియన్లు ఎన్ని చేస్తున్నారు? 
నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (NFHS), 1992-93 నుంచి 2015-16 వరకు నమోదైన డేటాను అధ్యయనం చేసింది. దీని ప్రకారం భారత్‌లో 18శాతం జననాలు సిజేరియన్ ద్వారానే నమోదవుతున్నట్లు తేలింది. కానీ దక్షిణ భారతదేశంలో అత్యంత ఎక్కువశాతం 40% డెలీవరీలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇంకో గమనిక ఏమిటంటే, IMA &MMR  లో మంచి ఫలితాలు సాధించి, బాగా అభివృద్ధి చెందిన దక్షిణ రాష్ట్రా లలోనే ఎక్కువ శాతం సిజేరియన్ లు జరుగుతున్నాయి. ఒక విధంగా ఆలోచిస్తే, సకాలంలో హై రిస్క్ కేసులను గుర్తించి సిజేరియన్ లు  చేయడం వల్లనే  IMR & MMR   లో మంచి గణనీయమైన ఫలితాలు నమోదు చేశామనిపిస్తుంది. 
 తెలంగాణ (57.7%), ఆంధ్రప్రదేశ్ (40.1%), కేరళ (35.8%), తమిళనాడు (34.1%) రాష్ట్రాలు అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో ముందున్నాయి.
భారత్‌లో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో  ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
" సమానమైన క్షేత్రస్థాయి బలాలున్న దేశాలను పోల్చవచ్చు గానీ,  వనరులు ఎక్కువ-జనాభా తక్కువ ఉన్న అభివృద్ధి చెందిన దేశాలతో మన దేశాన్ని పోల్చుకో కూడదు.
మనదేశంలో, రూరల్ ఏరియాల్లో  ఆధునిక వైద్య సదుపాయాలు తక్కువైనప్పటికీ సిజేరియన్ల సంఖ్య పెరుగుతోంది. వీటికి సరైన కారణాలు ప్రభుత్వం కనిపెట్టాలి. 
మా IMA  వారు పరిశీలిస్తే కొన్ని కారణాలు బయటపడ్డాయి. 
ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, ప్రభుత్వ హాస్పిటల్స్ కు ,ప్రవేట్ హాస్పిటల్స్ కు నాణ్యతలో తేడాలుండటం , గర్భిణీలు సరైన ఆహారము తీసుకోక పోవడం, ,వ్యాయామం చేయకపోవడం, సమాజంలో ముహుర్తాలపై మూఢ నమ్మకాలు పెరిగిపోవడం, ఓపికతో నార్మల్ డెలీవరీ జరగడానికి గర్భిణీలు,వారి తల్లితండ్రులు సహకరించక పోవడం,అన్నింటికంటే ముఖ్యంగా  నార్మల్ డెలీవరీలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడములో ప్రభుత్వం విఫలమవ్వడం  తదితర సామజిక కారణాలే కనబడుతున్నాయి.  

Comments